
ప్రమాద కేసును మలుపు తిప్పిన సీసీటీవీ ఫుటేజ్
బైకర్ ను ఉద్దేశపూర్వకంగా వెంటాడి ఢీ కొట్టి హత్య చేసిన భార్యాభర్తలు, సైడ్ మిర్రర్ పగలగొట్టాడని ఘాతుకానికి ఒడిగట్టిన సైకో జంట
బెంగళూర్ లో ఓ కారులో ప్రయాణిస్తున్న జంట తమ ఎదురుగా ఉన్న బైకర్ ను ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టిన ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న గిగ్ వర్కర్ మృతి చెందగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు.
ఇది నగరంలోని పుట్టేనహళ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అక్టోబర్ 25న రాత్రి 11.30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మొదట ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని పోలీసులు భావించారు. అయితే సంఘటన స్థలంలో లభించిన సీసీ టీవీ ఫుటేజ్ తో కేసు కీలకమలుపు తిరిగింది.
ప్రమాదం జరగడానికి ముందు ఓ కార్ వేగంగా దూసుకువచ్చి ఉద్దేశపూర్వకంగా బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ దర్శన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు అయిన వరుణ్(24) గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం సమీప ఆస్పత్రిలో చేర్పించారు.
కేసు మలుపు తిప్పిని సీసీటీవీ ఫుటేజ్..
కారు ఉద్దేశపూర్వకంగా బైక్ ను వెంటాడి ఢీ కొట్టిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సౌత్) లోకేష్ జగలసర్ తెలిపారు. మొదట ప్రమాదవశాత్తూ జరిగిన మృతిగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అంతకుముందు కారు, బైకర్ కు మధ్య చిన్నపాటి ఆక్సిడెంట్ జరిగిందని, దానివల్ల కారు సైడ్ అద్దం పగిలిపోయిందని తెలిసింది. కోపంతో ఉన్న కారు డ్రైవర్ వాహానాన్ని ఉద్దేశపూర్వకంగా వెంబడించి ఢీ కొట్టారని తెలిపారు.
జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. మొదటిసారి కారుతో ఢీ కొట్టడానికి ప్రయత్నించగా, అప్పుడు విఫలమయ్యాడని, మరోసారి యూటర్న్ తీసుకుని వచ్చి వెంబడించాడని వార్తా కథనాలు ప్రసారం చేశారు.
‘‘ప్రాథమిక విచారణలో కారును ఢీకొట్టిన బైకర్, దాని మిర్రర్ పగలగొట్టాడు. కోపంతో ఉన్న డ్రైవర్ తన వాహానాన్ని వెనక్కి తిప్పి వారిని ఉద్దేశపూర్వకంగా వెంబడించాడు. సమయం రాగానే దానిని ఢీ కొట్టి మరణానికి కారకడయ్యాడు’’ అని డీసీపీ చెప్పారు.
సాక్ష్యాల నాశనానికి కుట్ర..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్.. సంఘటన జరిగిన తరువాత తన భార్యతో కలిసి ప్రమాద స్థలానికి తిరిగి వచ్చాడు. తమ గుర్తింపును దాచడానికి ఇద్దరు ముసుగులు ధరించారని, ఆధారాలను నాశనం చేయడానికి సంఘటన స్థలంలో తమ వాహానం విరిగిన భాగాలను సేకరించారని పోలీసులు తెలిపారు.
దీనిపై పోలీసులు విచారణ చేసి నిందితులపై బీఎన్ఎస్ లోని సెక్షన్ల ప్రకారం హత్య, సాక్ష్యాలను నాశనం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం భార్యభర్తలిద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Next Story

