ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ పై కేసు నమోదు
x
అరుల్ విఘ్నేష్

ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ పై కేసు నమోదు

కలెక్టర్ కు అసభ్య సందేశాలు పంపి, అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్లిన ఎమ్మెల్యే


తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు చెందిన ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్ వివాదంలో చిక్కుకున్నారు. కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌ను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపడంతోపాటు, ఆమె అధికారిక నివాసంలోకి అనుమతి లేకుండా ప్రవేశించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ వ్యవహారం ఇప్పుడు మద్రాస్ హైకోర్టు విచారణకు చేరింది.

ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఆర్. త్రిషులి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. నవంబర్ 11న ఈ విషయంపై రాష్ట్ర డీజీపీ, కల్లకురిచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. కలెక్టర్‌కు పంపినట్లు ఆరోపిస్తున్న అసభ్య సందేశాలు, ఆమె అధికారిక నివాసంలోకి అక్రమంగా ప్రవేశించిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ విచారించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్ సత్యన్ కీలక విషయం వెల్లడించారు. ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్‌పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపారు.

అయితే ఈ కేసులో బాధితురాలి వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013లోని సెక్షన్ 16 ప్రకారం బాధితురాలి గుర్తింపును వెల్లడించే వివరాలు, ఫిర్యాదుకు సంబంధించిన సమాచారం బయటపెట్టకూడదని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి నిషేధిత సమాచారాన్ని ప్రచురించవద్దని మీడియాకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా, ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించిన సమాచారం లేదా సందేశాలు ప్రచారంలో ఉంటే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి బాధితురాలి గుర్తింపును బయటపెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

మరోవైపు, ఈ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక ప్రజాప్రతినిధిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దర్యాప్తును ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) స్థాయి లేదా అంతకంటే ఉన్నత స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించింది.

తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. ఒకవైపు ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు, మరోవైపు బాధితురాలి గోప్యత విషయంలో హైకోర్టు కఠిన ఆదేశాలతో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆరోపణలపై దర్యాప్తు పూర్తయిన తర్వాతే వాస్తవాలు స్పష్టమవుతాయి.

Read More
Next Story