
డీఎంకే 'సీక్రెట్ బాస్' ఎవరో చెప్పేసిన విజయ్..
తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్లను బహిరంగంగా ప్రస్తావించారు.
తమిళనాడు(Tamil Nadu)లో వచ్చే ఎన్నికలలో ప్రధాన పోటీ టీవీకే, డీఎంకే మధ్యే ఉంటుందని తమిళగ వెట్రి కజగం(TVK) చీఫ్ విజయ్ పేర్కొన్నారు. తిరువాన్మియూర్‌లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ(PM Modi), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin)పై విమర్శలు గుప్పించారు. వారి పేర్లను బహిరంగంగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి.
డీఎంకే 'సీక్రెట్ బాస్' బీజేపీ..
విజయ్ తన ప్రత్యర్థులపై రాజకీయ దాడిని కాస్త పెంచారు. బీజేపీ(BJP), డీఎంకే(DMK) మధ్య రహస్య పొత్తు ఉందని ఆరోపించారు. "మోదీ, స్టాలిన్ పాలిటిక్స్ హిట్లర్, ముస్సోలినీ పాలనను ప్రతిబింబిస్తాయని - ఒకరు నాయకత్వం వహిస్తే..మరొకరు అనుసరిస్తారని, డీఎంకేకు రహస్య బాస్ బీజేపీనే అని వ్యాఖ్యానించారు. "మోదీ జీ..దయచేసి తమిళనాడు పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. తమిళ ప్రజలు అంత సులభంగా దేన్ని అంగీకరించరు." అంటూ ప్రధాని పేరును ప్రస్తావించారు.
కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ.. “వారు (కేంద్రం) తమిళనాడు నుంచి GST వసూలు చేస్తారు. కానీ మాకు నిధులు తిరిగి కేటాయించరు. హిందీని బలవంతంగా రుద్దుతారు. కాని మా పిల్లల చదువుకు డబ్బులు ఇవ్వరు. తమిళనాడు ప్రజలు అమాయకులు కాదు. ఓటు ద్వారా సమాధానం చెబుతారు.’’ అని బీజేపీని హెచ్చరించారు.
కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి..
‘‘రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది. మిమ్మల్ని మీరు 'వీరప్ప' అని అనుకుంటే సరిపోదు. చేతల్లో చూపాలి" అంటూ సీఎం స్టాలిన్‌ను విమర్శించారు. వచ్చే ఎన్నికలలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పార్టీ శ్రేణలకు సూచించారు. కాగా బీజేపీ-డీఎంకే సంబంధాలపై విజయ్ చేసిన ఆరోపణలు..ప్రస్తుత రాజకీయ స్థితిని దెబ్బతీసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.