
మైసూరు దసరా ఉత్సవాలకు భాను ముష్తాక్‌కు ఆహ్వానం..
ఉత్సవాలకు ఆహ్వానించడంపై బీజేపీ అభ్యంతరం చెప్పడానికి కారణమేంటి? సీఎం సిద్ధరామయ్య ఏమంటున్నారు? బుకర్ ప్రైజ్ విజేత భాను ముష్తాక్ సమాధానమేంటి?
ప్రఖ్యాత మైసూరు(Mysore) దసరా(Dasara) ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న తేదీన ముగుస్తాయి. చాముండి కొండపై జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కన్నడ రచయిత్రి, బుకర్ ప్రైజ్ గ్రహీత భాను ముష్తాక్(Banu Mushtaq) సీఎం కోరారు. ఈ మేరకు మైసూరు డిప్యూటీ కమిషనర్ (డీసీ) లక్ష్మీకాంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం హసన్‌లోని ఆమె ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. గౌరవపూర్వకంగా ఆమెకు పట్టు శాలువ, మైసూరు పేట (తలపాగా)తో సత్కరించారు. భాను ముష్తాక్ కూడా ఉత్సవాలకు హాజరవుతానని చెప్పారు. ఆహ్వానించినందుకు సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah)కు, మైసూరు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు.
బీజేపీ(BJP) అభ్యంతరం..
దసరా ఉత్సవాలకు ముష్తాక్‌ను ఆహ్వానించడాన్ని ప్రతిపక్ష బీజేపీ సహా కొన్ని వర్గాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కన్నడ భాషను "దేవత భువనేశ్వరి"గా పూజించడంపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమెను ఉత్సవాలకు ఆహ్వానించడపై వారు గుర్రుగా ఉన్నారు. అయితే ఆ వివాదంతో ముష్తాక్ ప్రస్తుతం ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడలేదు.
‘ముష్తాక్‌ను సత్కరించేందుకే..’
దసరా పండుగను అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటారని, బీజేపీ కావాలని రాజకీయం చేయడం తగదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. అంతర్జాతీయ బుకర్ బహుమతి గెలుచుకున్న ఆమెను సత్కరించేందుకు భాను ముష్తాక్‌ను ఆహ్వానించామని చెప్పారు. ముష్తాక్‌ను దసరా ఉత్సవాలకు ఆహ్వానించడం ద్వారా కర్ణాటక (Karnataka) సాంస్కృతిక వారసత్వానికి ఖ్యాతి దక్కుతుందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.
ఎవరీ భాను ముష్తాక్ ?
భాను ముష్తాక్ ప్రముఖ కన్నడ రచయిత్రి. ఆమె రచించిన ‘హృదయ దీప’ పుస్తకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. బుకర్ ప్రైజ్ (Booker Prize) అందుకున్న తొలి కన్నడ రచయిత్రి. హసన్ జిల్లాలో పుట్టి పెరిగిన ఆమె కన్నడ సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. జర్నలిస్ట్‌గా పనిచేసిన భాను ముష్తాక్ కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు, చింతామణి అత్తిమబ్బే అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆమె సాహిత్య రచనలు పలువురి ప్రశంసలు పొందాయి.