బెంగళూర్: జైళ్లో రౌడీ షీటర్ కు రాచమర్యాదలు
x
బెంగళూర్ పరప్పన అగ్రహార జైలులో ఖైదీలకు మద్యం, స్నాక్స్ అందించినట్లు ఉన్న చిత్రాలు

బెంగళూర్: జైళ్లో రౌడీ షీటర్ కు రాచమర్యాదలు

పరప్పన అగ్రహార జైలు వీడియోలు మరిన్ని విడుదల, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు


బెంగళూర్ పరప్పన అగ్రహార జైలు లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు సెల్ ఫోన్ సౌకర్యం కల్పిస్తున్న వీడియోలు బయటకు వచ్చిన విషయం మర్చిపోక ముందే మరో వీడియో బయటకు వచ్చింది.

ఈ సారి జైలు ఆవరణలో ఖైదీలు, మద్యం, స్నాక్స్, నృత్యాలతో విలాసవంతమైన సౌకర్యాలు అనుభవిస్తున్న క్లిప్ బయటకు వచ్చింది. తాజా దృశ్యాలు ప్రజలను తీవ్ర దిగ్భాంతికి గురి చేశాయి. రాష్ట్ర హోంమంత్రి జీ. పరమేశ్వర దీనిపై స్పందించారు. జైళ్లలో ఇటువంటి దుష్ప్రవర్తనను సహించమని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

జైలులో మద్యం పార్టీ
జాతీయ మీడియా కథనం ప్రకారం.. తాజా వీడియోలో మద్యంతో నిండిన డిస్ఫోజబుల్ గ్లాసులు, కట్ చేసిన పండ్లు, వేయించిన పల్లికాయలు( వేరుసెనగ) జైలు లోపల పార్టీ కోసం చక్కగా అమర్చినట్లు స్పష్టంగా కనిపించింది.
వీడియోలో వరుసగా నాలుగు చిన్న మద్యం సీసాలు కూడా కనిపించాయి. కొంతమంది ఖైదీలు పాత్రలు, ఇతర పరికరాలతో చేస్తున్న శబ్ధాలకు నృత్యం చేస్తున్నారు. అయితే ఫుటేజీ ఎక్కడ నుంచి వచ్చింది. అది నిజామా? కాదా? అనేది ఇంకా ధృవీకరణ కాలేదు.
అయితే ఇవన్నీ కచ్చితంగా బెంగళూర్ పరప్పన అగ్రహార జైలువని కొన్ని సంస్థలు ధృవీకరించాయి. ఈ పరిణామం జైలులోని భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఇక్కడ అనేక మంది హై రిస్క్, హై ప్రొఫైల్ దోషులు ఉన్నారు. ఈ పరిణామం జైలులోని భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తింది. ఐసిస్ రిక్రూటర్, సీరియల్ రేపిస్ట్ కిల్లర్ సహ అనేక మంది పేరు మోసిన నేరస్థులు సెల్ ఫోన్లు ఉపయోగిస్తూ టెలివిజన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు ఇది వార్తాల్లో నిలిచింది.
కఠిన చర్యలు తీసుకుంటాం..
జైలులో జరిగిన అవకతవకలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(జైళ్లు) బీ దయానంద నుంచి నివేదిక కోరినట్లు రాష్ట్ర హోంమంత్రి జీ. పరమేశ్వర ఆదివారం తెలిపారు.
‘‘నాకు నివేదిక ఇవ్వాలని నేను డీజీపీని ఆదేశించాను. నివేదిక సరిగా లేకపోతే నేను ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలు తీసుకుంటాను. ఈ అర్థం లేని పనిని నేను సహించను. ఇక ఇలాంటివి చాలు. వీటిని మళ్లీ జరగనివ్వను’’ అని మంత్రి అన్నారు.
‘‘జైళ్ల శాఖ తరుచుగా సిబ్బంది కొరత ఉందని చెబుతారు. కానీ ఉన్న సిబ్బంది కనీసం తమ విధులు నిర్వహించాలి. సిబ్బంది కొరత ఉందనే సాకుతో టీవీలు, మొబైల్ ఫోన్లు, ఇతర సౌకర్యాలు అందిస్తే దాన్ని జైలు అని ఎందుకు పిలవాలి?’’ అని ఆయన అన్నారు.
జైళ్లలో సీసీటీవీలు, జామర్లు..
జైళ్లలో సీసీటీవీ కెమెరాలు, సిగ్నల్ జామర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఖైదీలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్న వీడియోలకు స్పందిస్తూ ‘‘ఉగ్రవాదులు మాత్రమే కాదు. జైలు లోపల ఎవరికి ఫోన్లు లాంటి సౌకర్యాలు ఉండకూడదు.
లేకపోతే దానిని జైలులా భావించలేము’’ అని అన్నారు. ప్రస్తుతం జైలు అధికారులు వీడియోల ప్రామాణికతను ధృవీకరించడానికి, జైలు లోపల భద్రతా లోపాలకు కారణమైన వారిని గుర్తించడానికి అంతర్గత విచారణను ప్రారంభించారు.


Read More
Next Story