వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి కేంద్రంగా బెంగళూర్
x

వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి కేంద్రంగా బెంగళూర్

దేశంలోని 22 నగరాలకు విమానాల ద్వారా కొత్తిమీర రవాణా


దేశ ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూర్ ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రంగా మారుతోంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ) నుంచి ఉత్తర, తూర్పు భారత దేశాలకు కొత్తిమీర ఆకుల విమాన రవాణాలో రికార్డు స్థాయిలో పెరుగుదల జరిగింది.

విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన డేటా ప్రకారం.. జూన్- నవంబర్ 2025 మధ్య బెంగళూర్ నుంచి మొత్తం 5,904 మెట్రిక్ టన్నుల కొత్తిమీర ఆకులు విమానంలో రవాణా జరిగింది. గత సంవత్సరం కాలంతో పోలిస్తే ఇది 13 శాతం పెరుగుదల.
గమ్యస్థానం..
బెంగళూర్ సమీప ప్రాంతాల్లో పండించే కొత్తిమీర డిమాండ్ పరంగా కోల్ కత ముందువరుసలో ఉంది. బెంగళూర్ నుంచి ఎక్కువగా కొత్తిమీర ఇక్కడికే వెళ్తోంది. ఢిల్లీ, బాగ్డోగ్రా, రాంచీ, పాట్నా వంటి నగరాలు తరువాత వరుసలో ఉన్నాయి.
ఉత్తర, తూర్పు భారతంలోని వినియోగదారులు కర్ణాటకలో పండించే కొత్తిమీర రుచి, నాణ్యత పట్ల ఆకర్షణ కనపరుస్తున్నారు. ఈ సంవత్సరం షిప్ మెంట్ నెట్ వర్క్ మరింత విస్తరించింది.
ఐదు కొత్త నగరాలు, అగర్తల, ఆగ్రా, నాగ్ పూర్, అమృత్ సర్, పోర్ట్ బ్లెయిర్ నగరాలకు విమానాల ద్వారా కొత్తమీర దిగుమతి చేసుకుంటున్న కొత్త జాబితాలో చేరాయి. ఈ జాబితాతో దేశవ్యాప్తంగా 22 నగరాలకు బెంగళూర్ నుంచి నేరుగా రవాణా జరుగుతున్నాయి.
కోల్డ్ స్టోరేజ్ ప్రొత్సాహం..
కొత్తిమీర చాలా త్వరగా పాడైపోతుంది, వాడిపోతుంది. దీనివలన ఈ వ్యవసాయ ఉత్పత్తిని రోడ్డు, రైలు ద్వారా సుదూర ప్రాంతాలకు రవాణా చేయలేము. అయితే కెంపెగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధునాతన కోల్డ్ స్టోరేజ్ మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ఎయిర్ కార్గో సేవలతో పాటు తాజా ఉత్పత్తులు గంటల్లోనే ప్రధాన భారతీయ మార్కెట్లకు చేరుకుంటున్నాయి.
ఇది రైతులకు మెరుగైన ధరలు అందించేలా చేస్తోంది. పంటకోత తరువాత జరిగే నష్టాలను చాలావరకు మెరుగైన రవాణా వ్యవస్థ దూరం చేయగలుగుతోంది.
పొలం నుంచి విమానం వరకూ..
బెంగళూర్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన కొత్తిమీర నగర హోల్ సేల్ మార్కెట్లలోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి విమానాశ్రయానికి పంపుతున్నారు. విమానాశ్రయం పాడైపోయే కార్గో సౌకర్యాలను ఉపయోగించుకుని, ఉత్పత్తులు ఉత్తర, తూర్పు భారత నగరాలకు త్వరగా చేరుకుంటాయి. వాటి తాజాదనం అలాగే ఉంటుంది. ఈ సెటప్ రైతులకు మంచి లాభం రావడానికి సహాయపడుతుంది.
పెరుగుతున్న విమానయాన కేంద్రం..
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక ప్రధాన కార్గో హబ్ మాత్రమే కాదు. ఇది దక్షిణ భారతంలో అత్యంత రద్దీగా ఉండే ప్రయాణీకుల గేట్ వేలో ఒకటి. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఈ విమానాశ్రయం సంవత్సరానికి 37 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
సగటున రోజుకు లక్ష మంది వస్తున్నారు. ‘‘గార్డెన్ టెర్మినల్’’ అని కూడా పిలువబడే ఆధునిక టెర్మినల్ 2 ప్రారంభంతో విమానాశ్రయం వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 50 నుంచి 60 మిలియన్ల మధ్య పెరిగింది. టెర్మినల్ 2 మాత్రమే సంవత్సరానికి 25 మిలియన్ల మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంది.
కార్గో పరంగా బెంగళూర్ విమానాశ్రయం భారత్ లోనే అగ్రస్థానంలో ఉంది. వార్షిక సామర్థ్యం 4,00,000 మెట్రిక్ టన్నులకు పైగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ, ఔషధ ఉత్పత్తుల ఎగుమతికి దక్షిణ భారతంలో ఇది అతిపెద్ద కేంద్రంగా ఉద్భవించింది.


Read More
Next Story