
‘ఒక్క ఖాళీ మంచినీళ్ల బాటిలైనా కనిపించిందా?’
కనీసం మంచినీళ్ల కూడా ఇవ్వలేదన్న డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ
తమిళనాడు(Tamil Nadu) కరూర్(Karur)లో జరిగిన తొక్కిసలాట(Stampede)లో 41 మంది మరణానికి విద్యుత్ సరఫరా(Power Cut)లో అంతరాయమే కారణమని టీవీకే(TVK) నాయకుల ఆరోపణలపై డీఎంకే ఎమ్మెల్యే, తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ(Senthil Balaji) స్పందించారు. వేదిక వద్ద భద్రత కోసం తగినంత పోలీసు సిబ్బందిని నియమించలేదంటూ టీవీకే నేతలు కోర్టును ఆశ్రయించిన తర్వాత బాలాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. వేదిక వద్ద ఎలాంటి విద్యుత్ అంతరాయం లేదన్నారు.
"జనరేటర్ గది దగ్గర ఉన్న బారికేడ్లు పడిపోవడంతో అమర్చిన అదనపు లైట్లను నిర్వాహకులు ఆర్పేశారు. వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని చెప్పడానికి వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి" అని బాలాజీ విలేఖరులకు తెలిపారు.
‘‘టీవీకే నాయకులు పోలీసుల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోలేదు. భారీగా వచ్చిన జనసమూహాన్ని నియంత్రించడంలో పార్టీ వలంటీర్లు విఫలమయ్యారు. విజయ్ షెడ్యూల్ ప్రకారం వేదిక వద్దకు చేరుకుని ఉంటే అసలు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు.’’ అని పేర్కొన్నారు బాలాజీ.
తొక్కిసలాటను అత్యంత విషాదకర ఘటనగా అభివర్ణించిన బాలాజీ.. బాధితులను స్వయంగా కలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీలకు ప్లాన్ చేసుకునేటప్పడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాజకీయ పార్టీలు కోరారు.
టీవీకే నాయకులు జనాలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని బాలాజీ విమర్శించారు. "ర్యాలీ తర్వాత 2వేలకు పైగా చెప్పులు చెల్లాచెదురుగా కనిపించాయి. కానీ ఒక్క ఖాళీ నీటి బాటిల్ అయినా చూశారా? కనీసం తాగడానికి నీరు కూడా ఏర్పాటు చేయలేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
బాధితులందరికీ చికిత్స అందించడంలో ప్రభుత్వం తన విధిని నిర్వర్తించిందని చెప్పారు. "ఇప్పటివరకు గాయపడ్డ 108 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది." అని హామీ ఇచ్చారు.