ఏపీ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నరా?
x
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఏపీ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నరా?

ఐఆర్, 12వ పీఆర్‌సీ కమిషనర్ నియామకం, 40 వేల కోట్ల బకాయిల చెల్లింపుకు ఉద్యోగ సంఘాల డిమాండ్.


రాష్ట్రంలోని 16 లక్షల ఉద్యోగులు, నాలుగు లక్షలకు పైగా పెన్షనర్లు గత మూడేళ్లుగా తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని భరిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగులు మూడు సంవత్సరాలుగా మధ్యంతర భృతి (ఐఆర్) పొందుతూ ఆర్థిక లాభాలు పొందుతుంటే, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు లక్షలాది రూపాయలు కోల్పోతున్నారని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ, తక్షణం ఐఆర్ ప్రకటించి, 12వ పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించాలని, పెండింగ్‌లో ఉన్న 40 వేల కోట్లకు పైగా బకాయిలను ముందుగా చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయాన్ని స్పష్టంగా ఎత్తి చూపారు. గతంలో 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను అడియాసలు చేయకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. “తెలంగాణ ఉద్యోగులు ఇప్పటికే మూడేళ్లుగా ఐఆర్‌తో ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. కానీ ఏపీలో ఉద్యోగులు లక్షల రూపాయలు కోల్పోతున్నారు. ఇంకా జాప్యం చేయడం తగదు” అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగుల మూడు కీలక డిమాండ్లు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తక్షణం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలి.

ఖర్చులు లేని విధంగా 12వ పీఆర్‌సీ కమిషనర్‌ను వెంటనే నియమించి, 90 రోజుల్లో నివేదిక తెప్పించి ప్రకటించాలి.

గత ప్రభుత్వ హయాంలోని బకాయిలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కింద చెల్లించాల్సినవి కలిపి సుమారు 40 వేల కోట్లకు పైగా బకాయిలను, ముఖ్యంగా రిటైర్డ్, చనిపోయిన ఉద్యోగుల సెటిల్‌మెంట్లు తక్షణం చెల్లించాలి.

ఉద్యోగులు, ప్రజలకు నమ్మకం కలిగించిన ప్రభుత్వం

అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమరావతి విషయంలో ప్రజలకు, ఉద్యోగులకు నమ్మకం కలిగించే లాగా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో చట్టం చేసి తన సత్తా నిరూపించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా కేక్ కట్ చేసి "జయహో అమరావతి" అని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకుంటూ రాష్ట్రం విడిపోగానే దశాబ్దం క్రితం పేరుతో లోగోలో అమరావతి చిహ్నంతో ఏర్పాటైన తొలి ఉద్యోగుల జేఏసీ "ఏపీ జేఏసీ అమరావతి" అని చెప్పారు.

అయితే అమరావతి రాజధానిని ఇంకా పటిష్ట పరిచేందుకు ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఉద్యోగులకు ఇల్లు స్థలాలు కేటాయించిన విధంగానే రాజధాని అమరావతిలో కూడా రాష్ట్ర సచివాలయం, శాఖాపరమైన (హెచ్వోడి) కార్యాలయాల ఉద్యోగులకు వెంటనే స్థలాలు కేటాయించి ఉద్యోగుల్లో కూడా మనోధైర్యం నింపాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు.

ఏపీజేఏసీ అమరావతి సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, “రిటైర్డ్ ఉద్యోగులు, చనిపోయినవారి కుటుంబాలు బకాయి డబ్బులు తీసుకోకుండానే మరణిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ముఖ్యమంత్రి ఇతర హామీలన్నీ నెరవేరుస్తున్నారు కానీ ఉద్యోగుల హామీల్లో వెనకడుగు వేయడం నిరాశ కలిగిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా విభాగం చైర్‌పర్సన్ పారె లక్ష్మి, సెక్రెటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లకు ధన్యవాదాలు తెలిపారు. అయితే “ఉద్యోగులకు ఇంటి స్థలాలు త్వరగా కేటాయించాలి. బకాయిలు, ఐఆర్, పీఆర్‌సీ విషయాల్లో కూడా ఉద్యోగులకు భద్రత, భరోసా కల్పించాలి” అని కోరారు.

Read More
Next Story