ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ రాజీనామా, త్వరలో వెబ్ సైట్ ప్రారంభం
x

ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ రాజీనామా, త్వరలో వెబ్ సైట్ ప్రారంభం

రెండు ప్రధాన తెలుగు దినపత్రికలు- సాక్షి, ఆంధ్రజ్యోతి-ఎడిటర్లు మారనున్నారు. ఈ రెండు దినపత్రికలకు ఒకే రోజు అంటే నవంబర్-1న కొత్త ఎడిటర్లు రాబోతున్నారు.


రెండు ప్రధాన తెలుగు దినపత్రికలు- సాక్షి, ఆంధ్రజ్యోతి-ఎడిటర్లు మారనున్నారు. యాదృచ్ఛికమే కావొచ్చు గాని ఈ రెండు దినపత్రికలకు ఒకే రోజు అంటే నవంబర్-1న కొత్త ఎడిటర్లు రాబోతున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు సుమారు పదహారేళ్లు ఎడిటర్ గా పని చేసిన కండ్లకుంట శ్రీనివాసాచార్యులు ఎలియాస్ కె.శ్రీనివాస్ పది రోజుల కిందట చేసిన రాజీనామాను ఆ పత్రిక యజమాని రాధాకృష్ణ శనివారం ఆమోదించారు. రోజువారీ జరిగే ఎడిటోరియల్ బోర్డు సమావేశానికి కె.శ్రీనివాస్ శుక్రవారం హాజరుకాలేదు. మీటింగ్ సమయానికి ఆయన తనకు వేరే మీటింగ్ ఉందంటూ తన సహచరునికి చెప్పి బయటకు వెళ్లిపోయినట్టు సమాచారం. అక్టోబర్ 31న ఆయన తప్పుకుంటారు. నవంబర్ 1 నుంచి కొత్త సంపాదకునిగా ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతికి వెళ్లిన నాదెండ్ల రాహుల్ కుమార్ బాధ్యతలు చేపడతారు.


1961 జూలై 24న జన్మించిన కే శ్రీనివాస్ వాస్తవానికి ఐదేళ్ల కిందటే రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని యాజమాన్యం పొడిగించింది. నల్గొండ జిల్లా నుంచి ఇటీవలి కాలంలో ఎడిటర్లు అయిన ఇద్దరిలో ఒకరు కే శ్రీనివాస్ కాగా మరొకరు వర్దెల్లి మురళి. శ్రీనివాస్ జ్యోతికి, మురళి సాక్షికి ఎడిటర్లుగా పని చేశారు. ఇద్దరూ సన్నిహితులే. రెండు మూడు పత్రికల్లో కలిసే పని చేశారు. ఇద్దరూ వామపక్ష వాదులే. తెలంగాణ వాదులే. అయితే చిత్రంగా ఈ ఇద్దరూ సమైక్యాంధ్రను కోరుకున్న పత్రికా యాజమాన్యాల కిందనే పని చేశారు. మురళీని సాక్షి యాజమాన్యం సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ ఎడిటోరియల్ డైరెక్టర్ హోదాలో కొనసాగించనుంది.

కండ్లకుంట గ్రామంలో జన్మించిన శ్రీనివాస్ సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి రాగా మరొకరు గౌడ సామాజికవర్గం నుంచి వచ్చిన వారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు అళహ సింగరాచార్యులు, రంగనాయకమ్మ. ఈ దంపతులకి శ్రీనివాస్ రెండవ సంతానం. ఈయన తండ్రి సంస్కృతాంధ్ర భాషా పండితుడు. మురళీ తండ్రి బుచ్చిరాములు సీపీఎంలో సుదీర్ఘకాలం పని చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు.
ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఓరియంటల్‌ కాలేజీలో బిఏ, ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో ఎం.ఏ, ఎంఫిల్ చేశారు. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి తెలంగాణలో సాహిత్య పునర్వికాసం – 1919 – 1939 అనే అంశం మీద పి. హెచ్ డి చేసి జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ పొందాడు.
విద్యార్థి దశలో కళా సౌరభం వంటి చిన్న పత్రికలకి స్పెషల్ ఇష్యూస్ తెచ్చిన అనుభవంతో శ్రీనివాస్, ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పనిచేశారు. ఆంధ్రజ్యోతిని సీనియర్ జర్నలిస్టు వి.రాధాకృష్ణ నాయకత్వంలో 2002లో తిరిగి పునరుద్ధరించినప్పటి నుంచి 2008 వరకూ వివిధ హోదాలలో పనిచేశారు. 2008లో అప్పటి వరకు ఎడిటర్ గా ఉన్న కే.రామచంద్రమూర్తి రాజీనామా చేసి హెచ్.ఎం.టీవీకి వెళ్లినప్పుడు కే.శ్రీనివాస్ జ్యోతికి ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు ఆయన మనసంతా ఆవైపే ఉన్నా యాజమాన్యం న్యూట్రాలిటీ వైపు మొగ్గడంతో ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కొంత తేటపడినప్పటికీ యాజమాన్యంతో భేదాభిప్రాయాలు ఉండేవని చెబుతుంటారు. ‘సంభాషణ’ కాలమ్ ను నిర్వహించే వారు.
తెలుగు భాష, అస్తిత్వ ఉద్యమాలు, స్థానికత భావనలను ఆయన గుర్తించారు. ఆయన రచనలు కూడా ఆశైలిలోనే ఉండేవి. అనేక అవార్డులు కూడా అందుకున్నారు. తెలుగురాష్ట్రాలలో ఏ సాహిత్య సభ పెట్టినా ముందుగా గుర్తుకువచ్చే పేరు ఆయనదే.
ఆయన భార్య సుధ ఆంధ్రావాసి. ఆమె కూడా వామపక్ష భావజాలం నుంచి వచ్చిన వారే. వీరికి ఒక కుమార్తె బందగీ, ఓ పెంపుడు కుమారుడు బోధి ఉన్నారు.
త్వరలో సోషల్ మీడియా వెబ్ సైట్ ప్రారంభం...
ఆంధ్రజ్యోతికి రాజీనామా చేసిన కే.శ్రీనివాస్ తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ, మరో వామపక్ష మేధావి ఘంటా చక్రపాణి లాంటి వారితో కలిసి సోషల్ మీడియాలో ప్రవేశించాలని యోచిస్తున్నారు. త్వరలో పెద్దఎత్తున ఓ వెబ్ సైట్, యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాలనుకుంటున్నట్టు సమాచారం. వీరి ప్రయత్నానికి ఓ పెద్ద పబ్లిషర్ మద్దతుగా నిలిచినట్టు చెబుతున్నారు. వీరి నాయకత్వంలో ఛానల్, వెబ్ సైట్ ను తీసుకువస్తే మంచి ఆదరణ ఉండవచ్చునని ఆ పబ్లిషర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.


Read More
Next Story