అమిత్ షా చెన్నై టూర్ ఎందుకు?
x

అమిత్ షా చెన్నై టూర్ ఎందుకు?

AIADMK నేతలతో భేటీ ఉంటుందా? తమిళనాడు బీజేపీ చీఫ్ పేరును ప్రకటిస్తారా? 2026 ఎన్నికలకు గురుస్వామి రోడ్ మ్యాప్ ఇస్తారా?


కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఈ రోజు (ఏప్రిల్ 10) రాత్రి చెన్నై రానున్నారు. ఆయన రెండు రోజుల పర్యటన బిజీగా సాగనుంది. ముఖ్యంగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికలో ఎక్కువ స్థానాలు గెలుపొందడం, అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా షా చర్చలు సాగనున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తితో ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర బీజేపీ(BJP) కొత్త చీఫ్‌ నియామకంపై కూడా షా నిర్ణయం తీసుకుంటారని ఏఐఏడీఎంకె (AIADMK) నేతలు భావిస్తున్నారు.

ఫళని భేటి అవుతారా?

కొన్ని రోజుల క్రితం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి ఢిల్లీలో షాతో సమావేశమైన విషయం తెలిసిందే. పొత్తుకు అంగీకరించారు. అయితే షరతు విధించారు. ప్రస్తుత చీఫ్ కె అన్నామలై పక్కన పెడితేనే జతకడతామని ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాతే అన్నామలై తాను బీజేపీ చీఫ్ రేసులో లేనని ప్రకటించారు. గతంలో ఆయన ఏఐఏడీఎంకే నేతల గురించి చేసిన అభ్యంతర వ్యాఖ్యలే ఆయనను బీజేపీ చీఫ్ నుంచి వైదొలిగేలా చేశాయని రాజకీయ విశ్లేషకుల మాట. ఈ క్రమంలో మరోసారి కూడా అమిత్ షాతో ఫళని స్వామి భేటి అవుతారన్న వార్తలొస్తున్నాయి. తమకు మద్దతు ఇచ్చే క్రమంలో అన్నాడీఎంకే నుంచి దూరమయిన ఓ పన్నీర్‌సెల్వం (OPS), TTV దినకరన్‌ గురించి షా చర్చిస్తారా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు.

PMK కీలక నిర్ణయం..

NDA మాజీ మిత్రపక్షం పట్టాలి మక్కల్ కట్చి (PMK) కీలక నిర్ణయం తీసుకుంది. అన్బుమణి రామదాసును పక్కనపెట్టి PMK అధ్యక్షుడి S రామదాస్ బాధ్యతలు చేపట్టారు. కుమారుడికి వర్కింగ్ ప్రెసిడెంట్‌ పగ్గాలు అప్పగించారు. పీఎంకే ప్రస్తుతానికి ఎన్డీఏ శిబిరానికి దూరంగా ఉందని చెబుతూ.. కూటమి నిర్ణయాలను ఈ ఏడాది చివరి వరకు వాయిదా వేస్తున్నట్లు రామదాస్ సీనియర్ ప్రకటించారు. పీఎంకే తీసుకున్న నిర్ణయం బీజేపీ, ఏఐఏడీఎంకే నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడానికేనని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పీఎంకేకు బలమైన ఓటు బ్యాంకు ఉండడమే అందుకు కారణమని అంటున్నారు.

షా-గురుమూర్తి మీట్..

షా పర్యటనలో మరో కీలక అంశం.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, తమిళ రాజకీయ పత్రిక తుగ్లక్ సంపాదకుడు ఎస్ గురుమూర్తితో సమావేశమవ్వడం. ద్రవిడ రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్న గురుమూర్తి.. బిజెపి ఆశయాలకు అనుగుణంగా షాకు ఒక రోడ్‌మ్యాప్‌ ఇచ్చే అవకాశం ఉంది.

అలయన్స్ మస్ట్..

అన్నాడిఎంకె పొత్తును అన్నామలై బహిరంగంగా వ్యతిరేకించారు. బీజేపీ ఒంటరిగానే పోటీచేసి గెలవగలదని వాదించారు. కానీ చాలా మంది రాష్ట్ర నాయకులు డీఎంకేను గద్దె దించాలంటే పొత్తు తప్పనిసరి అన్న సంకేతాలిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బయటపడింది. ఓట్ షేర్ 11 శాతానికి పెరిగింది. కానీ ఒంటరిగా పోటీ చేసిన AIADMKకు ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే డీఎంకే నేతృత్వంలోని కూటమి 39 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది.

కొత్త బీజేపీ చీఫ్‌ పై ఉత్కంఠ..

తిరునెల్వేలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఎఐఎడిఎంకె ప్రముఖుడు నైనార్ నాగేంద్రన్ రేస్‌లోఉన్నారు. తేవర్ కమ్యూనిటీతో ఆయనకున్న సంబంధాలు దక్షిణ తమిళనాడులో అత్యధిక స్థానాలు గెలుపొందడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

గురుమూర్తి కూడా ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్నారన్నది కొందరి మాట. రేస్‌లో ఆనందన్ అయ్యసామి అనే యువ దళిత నాయకుడు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయ్యసామికి జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, మాజీ CEO శ్రీధర్ వెంబు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.

రేస్‌లో ఎవరెవరు?

తమిళనాడులోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి ఇప్పటికే పుతియ తమిళగమ్‌కు చెందిన కె కృష్ణసామి, తమిళగ మక్కల్ మున్నేట్ర కజగం జాన్ పాండియన్, తమిళ మానిల కాంగ్రెస్‌కు చెందిన జికె వాసన్, ఇంధియ జననాయకుడు కచ్చి టిఆర్ పచ్చముత్తు, పుతియ కత్యం పార్టీకి చెందిన ఎసి పుతియ నేడ్హి షణ్ముగం మద్దతు ఉంది.

ఆ ఇద్దరు కలిసొస్తారా?

గతంలో NDA, AIADMKతో ఉన్న విభేదాల కారణంగా ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని DMDK బీజేపీకి మద్దతు ఇస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి. ఇక PMK తన పొత్తు నిర్ణయాన్ని సంవత్సరం చివరి వరకు వాయిదా వేసింది.

షా పర్యటన సత్ఫలితాలు ఇస్తుందా? తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ చాలా ఏళ్ల కల నెరవేరుతుందా అన్నది వేచిచూడాలి.

Read More
Next Story