తమిళనాడు ఎన్నికలు: ఈ సారి కాంగ్రెస్ జతకట్టేదెవరితో?
x

తమిళనాడు ఎన్నికలు: ఈ సారి కాంగ్రెస్ జతకట్టేదెవరితో?

ఇటీవల కాంగ్రెస్ హై కమాండ్ మల్లికార్జున్ ఖర్గేతో తమిళనాడు కాంగ్రెస్ నేతల సమావేశం - TVK విజయ్‌తో పొత్తు అంశాన్ని ప్రస్తావించిన నాయకులు..


Click the Play button to hear this message in audio format

కాంగ్రెస్(Congress) హైకమాండ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)తో తమిళనాడు(Tamil Nadu) రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈనెల 17న ఢిల్లీలో సమావేశమయ్యారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కే.సీ. వేణుగోపాల్, పార్టీ సీనియర్లు పి. చిదంబరం, ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ హాజరయిన ఈ సమావేశంలో మొత్తం 41 మంది తమిళనాడు కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఒక వర్గం నాయకులు డీఎంకే(DMK)తో పొత్తును యథాతథంగా కొనసాగించాలని కోరగా.. మరో వర్గం మాత్రం కూటమిలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్ల వాటా, ప్రభుత్వంలో స్పష్టమైన భాగస్వామ్యం ఉండాలని డిమాండ్ చేయాలని అధిష్టానాన్ని కోరింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)తో పొత్తు అంశాన్ని పరిశీలించాలన్న అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తమైంది. కాగా ఢిల్లీలో హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయమని తమిళనాడు కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీ–తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, డీఎంకేపై హైకమాండ్‌కు ఉన్న నమ్మకం కారణంగా..కాంగ్రెస్ డీఎంకేతో కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.


టీవీకే ప్రస్తావన..

నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంతో తమిళనాట రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ‘విజయ్ తమిళనాడులో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నందున టీవీకే పార్టీతో పొత్తు గురించి కూడా ఆలోచించాలన్న తమ కోరికను కొందరు నేతలు ఖర్గే ముందుంచినట్లు సమాచారం.

మరోవైపు అధికార భాగస్వామ్యానికి తాము సిద్ధంగా లేమని డీఎంకే కఠినంగా చెప్పడం..కొంతమంది తమిళనాడు కాంగ్రెస్ నాయకులను అసంతృప్తికి గురిచేస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో అధికారాన్ని పంచుకునే సంప్రదాయం లేదని ద్రవిడ పార్టీ స్పష్టం చేస్తోంది.

అయితే డీఎంకే వైఖరిపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ వర్గం అధికార భాగస్వామ్యంపై గట్టిగా డిమాండ్ చేయాలన్న అభిప్రాయంతో ఉంది.

ఇక తమిళనాడు కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపని టీవీకే.. కాంగ్రెస్ నుంచి తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూసే అవకాశం ఉందని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.

Read More
Next Story