కర్ణాటకలో పొలాల్లో కన్నీళ్లు పారుతున్నాయ్...
x

కర్ణాటకలో పొలాల్లో కన్నీళ్లు పారుతున్నాయ్...

కర్ణాటక రాష్ట్రం వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరువు, పంటనష్టం, దిగుబడి రాకపోవడం, అప్పుల కారణంగా గత 15 నెలలుగా 1,182 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.


కర్ణాటక రాష్ట్రం తీవ్ర వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరువు, పంటనష్టం, దిగుబడి రాకపోవడం, అప్పుల కారణంగా గత 15 నెలలుగా 1,182 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, అప్పుల కారణంగా 2022-23లో 968 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి 2023-24లో మరింత దిగజారింది.

ఆత్మహత్యలు-పరిహారం..

ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కమిషనర్లు, జిల్లా పంచాయతీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల సమావేశంలో రెవెన్యూ శాఖ అన్నదాతల ఆత్మహత్యల వివరాలను ప్రభుత్వానికి వివరించింది. రికార్డుల ప్రకారం ఏప్రిల్ 1, 2023 - జూలై 4, 2024 మధ్యకాలంలో 1,182 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

బెలగావి జిల్లాలో అత్యధికంగా 122 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో హవేరి (120), ధార్వాడ్ (101) ఉన్నాయి. బెంగళూరు రూరల్, కోలార్, ఉడిపిలో ఆత్మహత్య ఘటనలు నమోదు కాలేదు. కాగా పరిహార పంపిణీకి 1,003 కుటుంబాలను అర్హులుగా పరిగణించగా.. వివిధ కారణాలతో 161 కేసులను పక్కనపెట్టారు.

ఇక ఉత్తర కర్ణాటకలో 994 కుటుంబాలకు పరిహారం పంపిణీ చేశారు. తొమ్మిది కేసులు జిల్లా కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 18 కేసులపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రెవెన్యూ శాఖ పేర్కొంది.

"ఉత్తర కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధిక వర్షాలు, పంట నష్టం, బ్యాంకు రుణాలు చెల్లించలేక బలవ్మరణాలకు పాల్పడ్డారు. కొందరు తమ పొలాల్లో విషంతాగి ప్రాణాలొదిలారు. రైతులు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడంపై సరైన అధ్యయనం జరగాలి’’ అని వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

పంటల బీమా..

"ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుంది. కర్ణాటక రైతు (రైతు) సురక్ష (భద్రత) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద తమ పంటలకు రైతులు బీమా చేసుకోవడానికి అనుమతిస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 2024 వానాకాలం సీజన్‌లో 19.43 లక్షల మంది రైతులు పంటల బీమా కోసం నమోదు చేసుకున్నారని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.

కేంద్ర సాయం కోసం..

రాష్ట్రంలోని 236 తాలూకాలలో 223 తాలూకాలు కరువు బారిన పడ్డాయి. 196 తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 35,162 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. దీంతో రూ.18,171 కోట్ల సాయం అందించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు..

గతేడాది తీవ్ర కరువు వల్ల కర్ణాటక రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏప్రిల్ 2023 నుంచి భారీ వర్షాలు, గాలులు వల్ల పరిస్థితి మరింత దిగజారింది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించనందున, రాష్ట్ర ప్రభుత్వం 223 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి ఉత్తర కర్ణాటకలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

పండ్లు, కూరగాయలు ..

నీటి సౌకర్యం పుష్కలంగా ఉన్నా ప్రాంతాలలోనూ రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని బాగల్‌కోట్ జిల్లా రైతు సంఘం నుంచి ఫకీరప్ప గుడ్డిమని చెబుతున్నారు. చెరకు, నల్లరేగడి, పచ్చిమిర్చి, సోయాబీన్, అల్లం, వరి పంటల సాగు సవాళ్లతో కూడుకున్నది. వీటి సాగులో నష్టాలు చవిచూసిన కొంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చామరాజనగర్, మాండ్య, మైసూర్, హావేరి, కలబురగి వంటి జిల్లాల్లో అరటి, ఉల్లి, టమోటా, నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయాయి. కోలార్, బెలగావిలో కరువు, అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. కలబురగిలో అకాల వర్షం కారణంగా బొప్పాయి పంట నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఊహించని వాతావరణ పరిస్థితులు..

చిక్కమగళూరులో కాఫీ, మిరియాల సాగు రైతులను పంటలను అధిక ఉష్ణోగత్ర దెబ్బతీసింది. అయితే ఉడిపి, దక్షిణ కన్నడలోని అరేకా రైతులు సరైన వర్షపాతం లేక కాయలు రాలిపోయాయి.

ఎండిపోతున్న నదులు..

అనుకూల వాతావరణ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడే కర్నాటక వ్యవసాయ రంగం ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో, మలప్రభ, ఘటప్రభ, కృష్ణా నదులలో ప్రవాహం తగ్గిపోవడంతో నీటి కొరత తీవ్రమైంది.

దిగజారిన రైతుల ఆర్థిక పరిస్థితి..

2023-24కి సంబంధించి కరువు సహాయం, పంటల బీమా చెల్లింపుల్లో జాప్యం రైతుల పరిస్థితిని మరింత దిగజార్చింది. సాగు రుణాలను రైతులు తిరిగి చెల్లించలేకపోయారు. రైతుల ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని మొత్తం 2,225 గ్రామాలు, 20 లక్షల మంది ప్రజలు ఏటా వరదలు, కొండచరియలు విరిగిపడటం వలన నష్టపోతున్నారు. రైతులు నష్టపోయేది ఇంకా ఎక్కువ. ఈ గ్రామాలను గుర్తించి శాశ్వత ఉపశమనానికి చర్యలు తీసుకోవాలని సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది వర్షాల కారణంగా ఇళ్లు, పంటలు దెబ్బతిన్న వారికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) ప్రకారం పరిహారాన్ని వెంటనే సెటిల్ చేయాలని సూచించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ఉదారంగా వ్యవహరించి, పరిహారం అందించాలని సూచించారు. చిన్నచిన్న కారణాలతో నష్టపరిహారం కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించవద్దని కూడా అధికారులను ఆదేశించారు.

కౌన్సెలింగ్ కేంద్రాలు..

జిల్లా స్థాయిలో రైతుల కౌన్సెలింగ్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. అప్పుల బారిన పడిన రైతులను, ఇతరులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఈ శాఖ కృషి చేస్తుంది.

ప్రధానంగా వ్యవసాయ రుణాలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పుల కారణంగా వారి సామాజిక స్థితిగతులు దెబ్బతిన్నాయి. అనావృష్టి, వరదలు, ఇతర వాతావరణ పరిస్థితులతో పంటల సాగులో నష్టం వాటిల్లడం మరో కారణమని రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ అన్నారు.

"కరువు సహాయ నిధి పంపిణీలో కర్ణాటక, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. కర్నాటక ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసింది. కర్ణాటక వ్యవసాయ ధరల కమిషన్‌కు ఇంకా ఛైర్మన్‌ను నియమించలేదు. ఈ సంస్థ మాత్రమే రైతులు నష్టాలను చవిచూసినపుడు కనీస మద్దతు ధర (MSP) నిర్ణయించడంలో సాయపడుతుంది.’’ అని పేర్కొన్నారు.

Read More
Next Story