తమిళనాడు సర్కార్ నిర్ణయానికి జై కొట్టిన నటుడు విజయ్..
తమిళ నటుడు విజయ్.. స్టాలిన్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఇంతకు ఏమిటా నిర్ణయం?
తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ నటుడు విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి మద్దతు తెలిపారు. NEET పరీక్ష నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని ఇటీవల తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం చేసిన విషయం తెలిసిందే.
బుధవారం పది, ఇంటర్ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
NEET కారణంగా తమిళనాడులోని పేద విద్యార్థులు వైద్య విద్యకు నోచుకోవడం లేదన్నారు. స్టేట్ సిలబస్, స్థానిక భాషలో చదివిన విద్యార్థులు “NCERT” పాఠ్యాంశాల ఆధారంగా నిర్వహించే పరీక్షలో ఎలా రాణించగలడని ప్రశ్నించారు. "ఒక దేశం, ఒకే పాఠ్యాంశం" ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
‘NAT విశ్వసనీయత కోల్పోయింది’
“NEETలో అక్రమాలు జరిగాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విశ్వసనీయతను కోల్పోయింది. ఇక NEET అవసరం లేదని అర్థమైపోయింది. ఆ పరీక్ష అవసరం లేదని తమిళనాడు అసెంబ్లీ తీర్మానిందింది. దానికి నేను హృదయపూర్వకంగా మద్దతు ఇస్తున్నా” అని విజయ్ పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా నీట్‌పై తమిళనాడు ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవించాలని కోరారు.
రాష్ట్రపతికి స్టాలిన్ లేఖ..
‘తమిళనాడును నీట్ నుంచి మినహాయించండి. 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు కల్పించండి. దీనిపై మా అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాం. అంగీకారం కోసం మీకు పంపుతున్నాం’ అని రాష్ట్రపతి ముర్ముకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల లేఖ రాశారు.
మీరూ లేఖలు రాయండి..
నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని తాము అసెంబ్లీలో తీర్మానం చేశామని, మీరు కూడా అలా చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారత కూటమితో జతకట్టిన ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇటీవల లేఖలు రాశారు. నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ను కూడా కోరారు.
ఎందుకు నీట్ వద్దంటున్నారు?
నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకోవడం, గ్రేస్ మార్కులు కలపడం, చివరకు పరీక్ష రద్దు చేయడం, సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించడం లాంటి పరిణామాల నేపథ్యంలో తమ రాష్ట్రాన్ని నీట్ నుంచి మినహాయించాలని స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈ పరీక్షా విధానం వివక్షతో కూడుకున్నదని, గ్రామీణ, పేద విద్యార్థులు వైద్య విద్యకు నోచుకోవడం లేదన్నది ఆయన వాదన.