
బెంగళూర్ హత్యలు: చిన్నారులతో నిందితుడి నాటకం.. బయటపెట్టిన ఫోన్ కాల్!
బాధిత కుటుంబాలు ఫోన్ చేస్తే సమాధానం ఇచ్చేందుకు పక్కాప్లాన్
బెంగళూరులో ఏడుగురిని హత్య చేసిన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా హతమార్చిన నిందితుడు.. ఆ విషయం బయటపడకుండా చిన్నారులతోనే అబద్ధాలు చెప్పించినట్లు తెలుస్తోంది. చివరకు ఓ బంధువు చేసిన ఫోన్ కాల్లో బాలుడు చెప్పిన సమాధానాలతో ఈ దారుణ హత్యల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా పోలీసులకు అందిన ఆడియో రికార్డింగ్ ఈ కేసులో కీలక ఆధారంగా మారింది.
బెంగళూరులోని రాజాజీనగర్‌లో నివసించే ఇంద్రుశేఖర్ ఈ వరుస హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 52 ఏళ్ల అతడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన కుటుంబ సభ్యులతో పాటు బంధువులను కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. సుమారు రెండు వారాల వ్యవధిలో ఏడుగురిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటనలో ఇంద్రుశేఖర్ భార్య సునీత, ఆమె సోదరుడు శంకర్, శంకర్ భార్య నళిని, వారి కుటుంబ సభ్యుడు శివకుమార్, అతడి భార్య దివ్య, వారి కుమారుడు పునీత్, సునీత తల్లి రూపావతి ప్రాణాలు కోల్పోయారు. బాధితులను గ్రైండ్స్టోన్తో కొట్టి చంపిన అనంతరం మృతదేహాలను కర్ణాటక, తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాలకు తరలించి పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇంతటి ఘోరానికి పాల్పడిన తర్వాత కూడా ఇంద్రుశేఖర్ సాధారణంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఎక్కడున్నారనే అనుమానం బంధువులకు రాకుండా ఉండేందుకు వారి మొబైల్ ఫోన్లను తన దగ్గరే ఉంచుకున్నాడు. బంధువుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు బాధితుల తరఫున తానే మాట్లాడేవాడని సమాచారం. అంతేకాదు, ఇద్దరు మైనర్ బాలురతోనూ ఫోన్లలో సమాధానాలు చెప్పించినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలోనే ఓ బంధువు నళిని కుమారుడికి ఫోన్ చేశాడు. అతడి తల్లిదండ్రులు శంకర్, నళిని ఎక్కడున్నారని అడిగాడు. అందుకు బాలుడు వారు ప్రయాణానికి వెళ్లారని, మూడు నెలల తర్వాత తిరిగి వస్తారని సమాధానం ఇచ్చాడు. తన సోదరుడు పునీత్ కూడా వారితోనే ఉన్నాడని చెప్పాడు.
అయితే బంధువు నళినితో మాట్లాడించాలని కోరడంతో బాలుడు మాట మార్చాడు. తాను బస్సు ఎక్కాల్సి ఉందని, పునీత్ కూడా తనతో పాటు బస్సులో ప్రయాణిస్తున్నాడని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఈ సమాధానాలు బంధువుకు అనుమానం కలిగించాయి. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ పోలీసులకు అందడంతో దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.
మరోవైపు, శివకుమార్, దివ్యలను హత్య చేసిన తర్వాత వారి కుమారుడు పునీత్‌ను కొంతకాలం ప్రాణాలతో ఉంచినట్లు తెలుస్తోంది. బంధువుల ఫోన్ కాల్స్‌కు సమాధానాలు చెప్పించేందుకు అతడిని ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత పునీత్‌ను కూడా హత్య చేసినట్లు సమాచారం. అయితే మరో మైనర్ బాలుడు నిందితుడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. మృతదేహాలను తరలించే సమయంలో కూడా ఆ బాలుడిని వెంట తీసుకెళ్లి, బంధువుల ఫోన్ కాల్స్‌కు సమాధానాలు చెప్పించేవాడని దర్యాప్తులో వెల్లడైంది.
ఇక ఈ కేసు విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఏడుగురి మృతదేహాలను గుర్తించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఆడియో రికార్డింగ్ ప్రామాణికతను పరిశీలించడంతో పాటు ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. హత్యలకు ఉపయోగించిన ఆయుధాలు, నేరాల వెనుక అసలు కారణాలు, ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
కేసును సమర్థంగా కోర్టులో వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని పోలీసులు కోరారు. చిన్నారులను సైతం ఈ నేరాల కప్పిపుచ్చేందుకు ఉపయోగించుకున్నారనే ఆరోపణలు ఈ ఘటన తీవ్రతను మరింత పెంచుతున్నాయి. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే మరిన్ని వివరాలతో ఈ కేసులో పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
