
‘ట్రాన్స్ రాజకీయ ప్రవేశంతోనే నిజమైన మార్పు’
ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ కల్కి సుబ్రమణ్యం..
తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం ఇటీవల ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం సమగ్ర విధానాన్ని రూపొందించింది. విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణలో ప్రాధాన్యం ఇచ్చినా.. రిజర్వేషన్లు, లింగమార్పిడి పురుషులకు(Trans man) అవకాశం లేకపోవడం గురించి లింగమార్పిడి హక్కుల కార్యకర్త కల్కి సుబ్రమణ్యంతో ది ఫెడరల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్లకు కేరళలో ఇస్తున్న ప్రాధాన్యం, తమిళనాడు ప్రభుత్వ విధానం లోపాలను కల్కి సుబ్రమణ్యం ఎత్తి చూపారు.
తమిళనాడు కొత్త ట్రాన్స్‌జెండర్ పాలసీపై మీ అభిప్రాయం?
నేను ఈ పాలసీని చదివినప్పుడు.. దానిలోని దాదాపు 70 శాతం నిబంధనలు ఇప్పటికే 2019 లింగమార్పిడి రక్షణ చట్టంలో ఉన్నవే అని అర్థమైంది. ఇందులో నిజంగా కొత్తగా ఏదైనా ఉందా? అని చూస్తే పాఠశాల స్థాయిలో విద్యా చొరవ కొత్తగా తీసుకొచ్చినట్లుంది. కమిటీల ఏర్పాటుకు కూడా హామీ ఇచ్చే ఈ విధానం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో వేచి చూడాలి.
పాలసీ ప్రారంభించిన కొద్ది రోజులకే టెంకాసిలో సమంత అనే ట్రాన్స్ మహిళపై దారుణంగా దాడి జరిగింది. ఈ పాలసీ ట్రాన్స్ జెండర్ల భద్రతకు సహాయపడుతుందా?
ఖచ్చితంగా కాదు. దేశవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ మహిళలు హత్యకు గురవుతూనే ఉన్నారు. గత సంవత్సరం కోయంబత్తూరులో రెస్టారెంట్ నిర్వాహకురాలు సంగీత హత్యకు గురైంది. నిందితుడిని గుర్తించినా.. అతనికి ఎలాంటి శిక్ష పడలేదు. ట్రాన్స్‌జెండర్ హత్యల కేసుల్లో మాకు న్యాయం జరగలేదు. తొలుత ఈ హత్యలను సంచలనంగా చూయించే మీడియా ఆపై మమ్మల్ని పట్టించుకోదు.
మీరు తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో ఏం కోరారు?
విద్య అనేది ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి పరివర్తన కలిగించే సాధనం. కార్పొరేట్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నా.. అవి పురుషులు, మహిళలకు మాత్రమే పరిమితం. ట్రాన్స్‌జెండర్ దరఖాస్తుదారులను తిరస్కరిస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు చాలా ముఖ్యమైనవి. అయితే వీటి నుంచి ప్రస్తావణే లేదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రికి సంవత్సరాల తరబడి చెబుతున్నా.. రిజర్వేషన్ల ప్రస్తావణ ఎప్పుడూ చర్చకు రాలేదు. ముఖ్యంగా భారతదేశంలో ట్రాన్స్‌జెండర్లను అధికారికంగా గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు.
ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా?
అవును. కేరళ అద్భుతమైన పురోగతి సాధించింది. రెండు దశాబ్దాల క్రితం కేరళ మీడియా, విశ్వవిద్యాలయాల్లో ట్రాన్స్-ఇన్‌క్లూజన్ గురించి నేను మొదటిసారి మాట్లాడినప్పుడు.. అక్కడ ట్రాన్స్‌ఫోబియా ప్రబలంగా ఉండేది. కానీ నేడు, చాలా మంది ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు కేరళ,కాలికట్ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసిస్తున్నారు.
కేరళలో ఇంకా రిజర్వేషన్లు లేవు. కానీ నిజాయితీగా ప్రయత్నాలు చేస్తోంది. ఉదాహరణకు దక్షిణాఫ్రికాలో పైలట్ శిక్షణ కోసం వెళ్లిన ఓ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ప్రభుత్వం నుంచి రూ. 25 లక్షలు అందుకున్నాడు. మన పొరుగున ఉన్న కర్ణాటక ఇప్పటికే ట్రాన్స్‌జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది.
పాలసీలో ట్రాన్స్‌మెన్‌లను ఎందుకు మినహాయించారు?
ఇది దిగ్భ్రాంతికరం. ట్రాన్స్ పురుషులను పూర్తిగా విస్మరించారు. రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డులో కొందరు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఈ విధానం ఎక్కువగా ట్రాన్స్ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, ట్రాన్స్ పురుషులకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ఇది పాలకుల అజ్ఞానాన్ని ఎత్తి చూపుతుంది. నేను జాతీయ ట్రాన్స్‌జెండర్ కౌన్సిల్ మెంబర్ అయినా నన్ను ఎప్పుడూ సంప్రదించలేదు. తమిళనాడు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి కూడా ఫోన్ కాల్ రాలేదు.
పాలసీ విడుదలకు ముందు కమిటీ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. అది నిజమేనా?
అది వాస్తవమే. ట్రాన్స్‌మెన్, రిజర్వేషన్లను విస్మరించడం క్షమించరానిది. మద్రాస్ హైకోర్టు వంటి కోర్టులు కూడా రిజర్వేషన్లను సిఫార్సు చేశాయి. NALSA vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 2014 తీర్పు కూడా దీనిని ధృవీకరిస్తుంది.
ప్రభుత్వంతో మరోసారి చర్చించేందుకు ప్లాన్ చేస్తున్నారా?
ఖచ్చితంగా. నేను సామాజిక న్యాయ మంత్రికి కూడా లేఖ రాయాలనుకుంటున్నా. ముఖ్యంగా రిజర్వేషన్ లేకపోవడం, ట్రాన్స్‌మెన్ అదృశ్యం కావడం గురించి. అవసరమయితే పోరాటాలకు దిగుతాం.
ఎన్నికలు సమీపిస్తుండడంతో అప్సర రెడ్డి, గంగా నాయక్ వంటి ట్రాన్స్ వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయ భాగస్వామ్యం కూడా అవసరం మీరు ఎందుకు అనుకుంటున్నారు?
అది చాలా అవసరం. నాకు వివిధ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి. కాని రాజకీయాల్లో మహిళలను హీనంగా చూస్తారని వాటికి దూరంగా ఉన్నా. అప్సర రెడ్డి, రియా గంగా నాయక్‌లకు నా మద్దతు ఉంటుంది. DMK, ADMK, TVK, BJP కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలలో మనకు ఎక్కువ మంది ట్రాన్స్ జెండర్లు అవసరం. మనకు త్వరలో ఒక ట్రాన్స్ జెండర్ MLA, ఒక MP కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్య ఏమిటి?
రిజర్వేషన్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరడానికి వేచి ఉన్న ట్రాన్స్ మహిళలు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరణకు గురయిన వారు మన దగ్గర ఉన్నారు.