PM Modi | ‘కుల రాజకీయాల పేరిట అశాంతి ప్రేరేపణకు కుట్ర జరుగుతుంది’
ప్రధాని మోదీ ‘గ్రామీణ్ భారత్ మహోత్సవ్’ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు బయటపెట్టకుండానే దేశంలో అశాంతికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.
కుల రాజకీయాల పేరిట కొందరు దేశంలో అలజడి సృష్టించాలని, అశాంతిని ప్రేరేపించాలని చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘గ్రామీణ్ భారత్’ మహోత్సవ్’ను ఆయన శనివారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి ‘వికసిత భారత్’ కలను సాకారం చేయడంలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
2014 నుంచి గ్రామీణ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రజలను నిర్లక్ష్యం చేశాయని ఎస్బీఐ నివేదికను ఉటంకించారు. 2012లో 26 శాతంగా ఉన్న గ్రామీణ భారత పేదరికం ఇప్పుడు 5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
జనవరి 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే ఈ మహోత్సవ్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, మేథావులు పారిశ్రామికవేత్తలు గ్రామీణ పరివర్తన కోసం సాంకేతికతను వినూత్న పద్ధతులను ఉపయోగించుకోవడంపై చర్చించనున్నారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.