ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు
x

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎట్టకేలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.


ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎట్టకేలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. గత 17 నెలల నుంచి ఆయన జైలులో ఉన్నారు. విచారణ పేరుతో నిందితుడిని అపరిమిత కాలం పాటు కటకటాల వెనుక ఉంచడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తి ప్రాథమిక హక్కు స్వేచ్ఛను హరించడమేనని అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను గతంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వేర్వేరుగా అరెస్టు చేశాయి. ఈ రెండు కేసుల్లో సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తన పాస్‌పోర్ట్‌ను ప్రత్యేక ట్రయల్ కోర్టుకు సరెండర్ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవద్దని, ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 10 నుంచి11 గంటల మధ్య విచారణ అధికారికి ముందు హాజరు కావాలని సూచించింది.

సత్యం విజయం: ఆప్ నేతలు

సుప్రీం కోర్టు తీర్పును ప్రశంసిస్తూ.. AAP "సత్య విజయం" అని పేర్కొంది. పార్టీకి చెందిన ఇతర జైళ్లలో ఉన్న నాయకులకు కూడా "న్యాయం లభిస్తుందని" పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా హిందీలో ఎక్స్‌పై చేసిన పోస్ట్‌లో, “ఢిల్లీ విద్యా విప్లవ వీరుడు మనీష్ సిసోడియాకు బెయిల్ లభించడంతో దేశం మొత్తం సంతోషంగా ఉంది. గౌరవనీయులైన సుప్రీంకోర్టుకు నా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనీష్ జీని 530 రోజులపాటు కటకటాలపాలయ్యాడు. పార్టీ ఇతర నేతలు అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌కు కూడా త్వరలో బెయిల్ లభిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి కూడా "సత్యమేవ జయతే"ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లో బెయిల్ కోరుతూ సిసోడియా పెట్టుకున్న పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు బెంచ్ పక్కన పెట్టింది. తాను 17 నెలలుగా కస్టడీలో ఉన్నా, విచారణ ప్రారంభించలేదని, విచారణ పేరుతో తనను జైలుకే పరిమితం చేశారని తన పిటిషన్‌లో కోరారు. సిసోడియాను ఫిబ్రవరి 26, 2023న సీబీఐ అరెస్టు చేసింది. మరుసటి నెల మార్చి 9, 2023న ED అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28, 2023న ఢిల్లీ మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు.

Read More
Next Story