‘బీహార్‌లో బీజేపీ కుట్రను భగ్నం చేస్తాం’
x

‘బీహార్‌లో బీజేపీ కుట్రను భగ్నం చేస్తాం’

‘ఓటర్ అధికార్ యాత్ర’లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..


అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ(BJP) ఎన్నికల సంఘం(EC)తో కుమ్మకై ఓట్లు దొంగతనానికి పాల్పడుతోందని లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (SIR) ద్వారా బీహార్‌లో గెలువాలన్న వారి కుట్రను సఫలీకృతం కానివ్వమని అన్నారు. SIRకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం బీహార్‌లో పర్యటిస్తున్నారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరిట 16 రోజుల పాటు జరిగే ఈ యాత్ర తొలిరోజు ససారాంలో ఆదివారం (ఆగస్టు 17న) ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, ఈసీపై విరుచుకుపడ్డారు. ఎన్నికల కమిషన్ బీజేపీతో కుమ్మకై ఎలా ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందో దేశం మొత్తానికి తెలిసి పోయిందన్నారు. యాత్రలో కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్, వికాశీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేష్ సహానీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ(ఎం)కి చెందిన సుభాషిణి అలీ పాల్గొన్నారు.


16 రోజులు.. 1300 కి.మీ..

అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో..రాహుల్ గాంధీ మహాఘటబంధన్ నాయకులతో కలిసి బీహార్‌లో పర్యటిస్తున్నారు. 16 రోజుల పాటు 23 జిల్లాలను కవర్ చేస్తూ.1300 కి.మీ దూరం కొనసాగనుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మెగా ర్యాలీతో యాత్ర ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ మణిపూర్ నుంచి ముంబైకి చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లాగానే.. ఈ 'యాత్ర' కూడా హైబ్రిడ్ రీతిలో అంటే కాలినడకన, వాహనంలో ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు.


యాత్ర రూట్ మ్యాప్..

ఔరంగాబాద్, గయా, నవాడా, నలంద, షేక్‌పురా, లఖిసరాయ్, ముంగేర్, భాగల్‌పూర్, కతిహార్, పూర్నియా, అరారియా, సుపాల్, మధుబని, దర్భంగా, సీతామర్హి, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, గోపాల్‌గంజ్, సివాన్, చప్రా, ఆరా మీదుగా యాత్ర సాగుతుంది.

Read More
Next Story