
పశ్చిమ బెంగాల్‌లో BLAలు లేకుండానే S.I.R విచారణ..
ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలకు పిలుపునిచ్చిన TMC జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ..
పశ్చిమ బెంగాల్(West Bengal)లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) విచారణ సమయంలో BLAలు ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల బూత్-లెవల్ ఏజెంట్లు (BLAలు) హాజరుకూడదని ఈసీ (EC) తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై ఈసీ కార్యాలయంలో బుధవారం (డిసెంబర్ 31) ఇరుపక్షాల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. ఈసీ నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని TMC డిమాండ్ చేస్తోంది. కమిషన్ ఆదేశాలను పార్టీ పాటించబోదని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. ఈసీ అధికారిక ప్రకటన బయటకు రాలేదని, కేవలం వాట్సాప్‌లో చక్కెర్లు కొడుతుందన్నారు. అయితే ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా జనవరి 2 నుంచి నిరసనకు దిగుతున్నట్లు బెనర్జీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందిని బెదిరించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.
ఈసీ నిర్ణయంపై సందేహం?
ఈసీ నిర్ణయం అనుమానాలకు తావిస్తోందని కోల్‌కతాకు చెందిన అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (APDR) ప్రధాన కార్యదర్శి రంజిత్ సుర్ పేర్కొన్నారు. విచారణ సమయంలో నిరక్షరాస్యులు, పేదలకు సహాయకారిగా ఉండే BLAలను ఎందుకు దూరం ఉంచాలనుకుందో అర్థకావడం లేదన్నారు. ఫిబ్రవరి 14న పశ్చిమ బెంగాల్ కొత్త తుది ఓటర్ల జాబితా విడుదల చేయనుంది.

