‘యూట్యూబ్‌ చూసి తుపాకీ పేల్చడం నేర్చుకున్నాం’
x

‘యూట్యూబ్‌ చూసి తుపాకీ పేల్చడం నేర్చుకున్నాం’

ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్యకు పాల్పడిన షూటర్లు యూట్యూబ్‌లో వీడియోలు చూసి తుపాకీలను పేల్చడం నేరుకున్నారని పోలీసులు తెలిపారు.


ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు పాల్పడిన షూటర్లు ముంబయిలోని కుర్లా ప్రాంతంలోని అద్దె ఇంట్లో యూట్యూబ్‌లో వీడియోలు చూసి తుపాకీలను పేల్చడం నేరుకున్నారని అధికారులు బుధవారం తెలిపారు. సిద్ధిఖీ (66)ని అక్టోబర్ 12 రాత్రి నిర్మల్ నగర్ ప్రాంతంలోని ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్దిక్ కార్యాలయంలో ముగ్గురు షూటర్లు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

ఇప్పటికి నలుగురి అరెస్ట్..

ఈ ఘటనలో ఇప్పటికి నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో హర్యానా నివాసి గుర్‌మైల్ బల్జిత్ సింగ్ (23), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19) షూటర్లు. హరీష్‌కుమార్ బలక్రమ్ నిసాద్ (23)తో పాటు కుట్రకు సహకరించిన ప్రవీణ్ లోంకర్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు శివకుమార్ గౌతం కోసం ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురు నిందితులది (శివకుమార్ గౌతం, ధర్మరాజ్ రాజేష్ కశ్యప్, హరీష్‌కుమార్ బలక్రమ్ నిసాద్) ఒకే గ్రామం.

గౌతమ్ మెయిన్ షూటర్..

సిద్దిఖీ హత్య కేసులో మెయిన్ షూటర్ శివకుమార్ గౌతమేనని క్రైం బ్రాంచ్ అధికారి తెలిపారు. తుపాకులను హ్యండిల్ చేయడం గౌతమ్‌కు బాగా తెలుసని, కుర్లాలోని అద్దె ఇంట్లో తుపాకీలను పేల్చడంలో తమకు శిక్షణ ఇచ్చింది కూడా గౌతమేనని విచారణలో గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్‌ పోలీసులకు చెప్పారు. దాదాపు నాలుగు వారాల పాటు యూట్యూబ్ వీడియోలను చూసి తుపాకీ పేల్చడం, బుల్లెట్స్ లోడ్ చేయడం, అన్‌లోడ్ చేయడం ఎలాగో నేర్చుకున్నారని విచారణాధికారి తెలిపారు.

బాంద్రాలోని బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన ముఠాలో ఒకడైన శుభమ్ లోంకర్‌ను జూన్‌లో పోలీసులు ప్రశ్నించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నెట్‌వర్క్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో విచారించారు.

శుభం లోంకర్‌పై గతంలో కేసు..

శుభం లోంకర్, ప్రవీణ్ లోంకర్ అన్నదమ్ములు. వీరు పూణేలో పాల డెయిరీ నడుపుతున్నారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని అకోట్ పోలీస్ స్టేషన్‌లో శుభంపై గతంలో కేసు నమోదైంది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు.. అతడి నుంచి పది తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. బెయిల్‌పై విడుదలైన శుభం ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్‌తో టచ్‌లో ఉన్నట్లు పోలీసుల అదుపులో ప్రవీణ్ లోంకర్ పోలీసులకు చెప్పాడు.

Snapchat యాప్‌‌లో ఛాట్..

సిద్ధిఖీపై కాల్పులు జరిపిన నిందితులు స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా కమ్యూనికేట్ చేసుకునేవారని దర్యాప్తులో వెల్లడైంది. మెసేజ్ చూసిన తర్వాత, నిర్ణీత సమయం దాటాక మెసేజ్‌లు వాటంతకు అవే డిలీట్ అయ్యే సౌలభ్యం Snapchat యాప్‌లో ఉండడం వల్ల అందులో చాట్ చేసేవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి కొన్ని మీటర్ల దూరంలో పిస్టల్‌ ఉన్న బ్యాగ్ ఒకటి పోలీసులకు దొరికింది. అందులో గౌతం ఆధార్ కార్డు ఉండడంతో అది ఆ బ్యాగ్ అతనిదేనని పోలీసులు నిర్ధారించారు. శనివారం రాత్రి కాల్పులు జరిపాక పారిపోతూ బ్యాగును పడేసినట్లు అనుమానిస్తున్నారు.

నిందితుల ఇల్లు తనిఖీ..

నిందితులు అద్దెకు ఉంటున్న కుర్లాలోని ఇంటిని క్రైం బ్రాంచ్ పోలీసులు మంగళవారం పరిశీలించారు. సిద్ధిఖీ కార్యాలయం, నివాసం వద్ద రెక్కీ నిర్వహించేందుకు నిందితులు వాడిన బైక్, రెండు హెల్మెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

Read More
Next Story