
‘శివసేన (యూబీటీ) కేవలం పార్టీ కాదు.. ఒక ఆలోచన’
బీఎంసీ ఎన్నికల్లో ఓటమి అనంతరం శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గళం ఎత్తారు. శివసేనను బీజేపీ ముగించగలదని భావిస్తే అవి కేవలం భ్రమేనని అన్నారు.
ముంబై(Mumbai) మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో ఓటమి ఎదురైన కొన్ని రోజుల తర్వాత.. శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీ నేతలు తమ పార్టీ ఉనికి లేకుండా చేయాలనుకోవడం వారి భ్రమ మాత్రమేనన్నారు. ‘‘శివసేన (యూబీటీ) Shiv Sena (UBT) కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు. ఒక ఆలోచన’’ అని పేర్కొన్నారు. శుక్రవారం అవిభక్త శివసేన వ్యవస్థాపకుడు, తన తండ్రి బాల్ ఠాక్రే శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఉద్ధవ్ ప్రసంగించారు. థాక్రే పేరును చెరిపివేయడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారని, అయితే ఆ పేరు చరిత్ర నుంచి తొలగిపోదని స్పష్టం చేశారు. శివసేన లేకపోతే బీజేపీ(BJP) బీఎంసీ గడప దాటేది కాదన్నారు.
ఉద్ధవ్‌కు ముందు ఆయన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే(Raj Thackeray) ప్రసంగించారు. మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని “బానిసల మార్కెట్”తో పోల్చారు. కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా రాష్ట్రంలోని పౌర సంస్థల ఎన్నికలను ప్రస్తుతం జరుగుతున్న “వేలం”గా అభివర్ణించారు.
జనవరి 15న జరిగిన బీఎంసీ ఎన్నికల్లో మొత్తం 227 సభ్యులున్న సభలో 89 సీట్లు గెలుచుకుని బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన (29 సీట్లు)తో కలిసి బీజేపీ, దేశంలోనే అత్యంత ధనిక పౌర సంస్థపై థాక్రేల దశాబ్దాల నియంత్రణకు ముగింపు పలికింది.
బీఎంసీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ)–ఎంఎన్ఎస్ కలయిక ఊహించిన దానికంటే గట్టి పోటీ ఇచ్చిందని ఉద్ధవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) 65 సీట్లు గెలుచుకోగా, రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ 6 సీట్లు సాధించింది.
‘ధనబలంతో గెలిచారు..’
“వారు ముంబైని మింగాలనుకుంటున్నారు” అని ఉద్ధవ్ ఆరోపించారు. నగరంలో జరిగిన ఈ పౌర ఎన్నికల సమయంలో తొలిసారిగా ధనబలం బాగా ఉపయోగించారని ఆరోపించారు. ఫలితాలు పార్టీ ఆశించిన విధంగా లేకపోయినా, బీఎంసీలో ప్రతిపక్షం బలమైన శక్తిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
సేన అధికారం కోసం కాకుండా, మరాఠాల హక్కుల కోసం పోరాడేందుకే పుట్టిందని గుర్తు చేశారు. మహారాష్ట్రపై మరాఠీయేతర సంస్కృతిని రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.. ఒకటో తరగతి నుంచి పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలనే నిర్ణయం కూడా ఈ కుట్రలో భాగమేనని అన్నారు.
శివసేన కార్యకర్తలు గర్వంగా ఉపయోగించే “జై మహారాష్ట్ర” నినాదం ప్రమాదంలో ఉందని హెచ్చరించిన ఉద్ధవ్.. ప్రతి ఒక్కరూ దానిని శుభాకాంక్షలు తెలిపే సందర్భాల్లో ఉపయోగించాలని కోరారు.

