శివసేన (యూబీటీ) మేనిఫెస్టో రిలీజ్.. బాలురకూ ఉచిత విద్య
x

శివసేన (యూబీటీ) మేనిఫెస్టో రిలీజ్.. బాలురకూ ఉచిత విద్య

‘‘అధికారంలోకి వస్తే నిత్యావసరాల ధరల స్థిరీకరణ, మహిళా కానిస్టేబుళ్ల నియామకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బాలురకూ ఉచిత విద్య, ’ - శివసేన (యూబీటీ) చీఫ్


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే గురువారం తన పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. అధికారంలోకి వస్తే బాలురకు ఉచిత విద్య, నిత్యావసరాల ధరల స్థిరీకరణకు కృషిచేస్తామన్నారు.

ముంబయిలోని తన నివాసం 'మాతోశ్రీ'లో మ్యానిఫెస్టో విడుదల చేశాక థాకరే విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల వాగ్దానాలు చాలావరకు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) హామీలలో భాగమేనని, అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని అన్నారు. శివసేన (యూబీటీ), కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్‌సీపీ (ఎస్‌పీ)తో కలిసి ఎంవీఏ నవంబర్ 20 తన మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తుందని చెప్పారు. ప్రతి జిల్లాలోనూ మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్‌ దేవాలయం ఉంటుందని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

ఎంవీఏ అధికారంలోకి రాగానే విద్యార్థినుల ఉచిత విద్య పథకాన్ని బాలురకు కూడా అమలు చేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. 18వేల మంది మహిళలను పోలీసు శాఖలో రిక్రూట్ చేసుకుంటామని, మహిళా పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామని థాకరే చెప్పారు.

ఆ ప్రాజెక్టు రద్దు చేస్తాం..

ధారవి పునరాభివృద్ధి ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ముంబయిపై ఈ ప్రాజెక్టు ప్రభావం చూపుతున్నందున రద్దు చేస్తామని చెప్పారు. వేగవంతమైన పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, ముంబైలో కూడా హౌసింగ్ పాలసీ తీసుకొస్తామన్నారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో ‘మట్టి పుత్రుల’ కోసం అందుబాటు ధరలో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తమ పార్టీ ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తుందని సేన (యుబీటీ) అధినేత చెప్పారు. అందులో భాగంగా ప్రతి మూడు నెలలకోసారి ప్రతి జిల్లాలో జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ఠాక్రే చెప్పారు.

Read More
Next Story