Manmohan memorial row | కాంగ్రెస్‌ను తప్పుబట్టిన ప్రణబ్ కుమార్తె
x

Manmohan memorial row | కాంగ్రెస్‌ను తప్పుబట్టిన ప్రణబ్ కుమార్తె

తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినపుడు సంతాప సభ ఎందుకు ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్‌ను సూటిగా ప్రశ్నించారు శర్మిష్ఠ.


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేక స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రతిపాదనను ఆమె తప్పుబట్టారు.

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు.

స్మారకానికి స్థలం కేటాయిస్తాం..

మన్మోహన్ సింగ్ దహన సంస్కారాలు, స్మారక చిహ్నం కోసం స్థలం ఏర్పాటు చేయకపోవడం దేశ తొలి సిక్కు ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని కాంగ్రెస్ శుక్రవారం ఆరోపించింది. దీంతో ఆయన అంత్యక్రియలను న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే స్మారకానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామని హోం మంత్రి అమిత్ షా మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమాచారం పంపారు.

‘బాబా చనిపోయినపుడు ఎందుకు చేయలేదు’

కాగా తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు 2020లో మరణించినప్పుడు, కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) ద్వారా సంతాప సభను కూడా ఏర్పాటు చేయలేదని ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్‌లోని ఓ సీనియర్ నేత తనకు చెప్పారన్నారు. అయితే.. తన తండ్రి డైరీని చదివితే అది నిజం కాదని తెలిసిందన్నారు. రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌కు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించినట్లు అందులో ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అనే పుస్తకం గురించి ఆమె ప్రస్తావించారు. అందులో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు స్మారక చిహ్నాన్ని నిర్మించలేదన్నారు. ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా స్వస్థలం హైదరాబాద్‌లో జరగాలని కాంగ్రెస్ కోరిన విషయం ఆ పుస్తకంలో ఉందని గుర్తుచేశారు.

Read More
Next Story