మహా కుంభమేళాలో మరోచోట తొక్కిసలాట: ఏడుగురి మృతి
x

మహా కుంభమేళాలో మరోచోట తొక్కిసలాట: ఏడుగురి మృతి

మౌనీ అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేసి తిరిగి వెళ్తున్న భక్తుల బృందానికి.. వ్యతిరేక మార్గంలో మరో భక్తుల సమూహం రావడంతో తొక్కిసలాట జరిగింది.


మహా కుంభమేళా(Maha Kumbh) సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని (Utter Pradesh) ప్రయాగ్‌రాజ్‌‌కు భక్తులు పోటెత్తుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి తరలివెళ్తున్నారు. మౌని అమావాస్య(Mauni Amavasya) రోజున దాదాపు 10 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అనుకున్నట్లుగానే భారీగా వచ్చిన జనం ఒకే చోట గుమికూడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 30 మంది చనిపోగా.. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన జనవరి 29న జరిగింది.

అదే రోజు మరో చోట..

అదే రోజు మరోఘాట్ వద్ద కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్‌రాజ్ ఝూసీ ప్రాంతంలో జరిగిన రెండో ఘటనలో ముగ్గురు మహిళలు, మూడేళ్ల చిన్నారి చనిపోయారని, మరో పదిమందికి తీవ్రగాయాలయ్యాయని హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.

ఎలా జరిగింది?

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జనవరి 29 బుధవారం ఉదయం 6 గంటలకు గంగానదిలో స్నానం చేసిన ఒక యాత్రికుల బృందం తిరిగి వెళ్తుండగా.. మరో బృందం వారికి వ్యతిరేక మార్గంలో వచ్చింది. దీంతో రెండు బృందాలు ఒకదానికొకటి ఎదురుపడటంతో ముందుకు కదల్లేక ఇరువైపులా భక్తుల సంఖ్య పెరిగిపోయింది.

సబ్‌స్టేషన్ వద్ద తొక్కిసలాట..

ముక్తి మార్గ్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సురేశ్ బింద్ కథనం ప్రకారం.. ‘‘భక్తుల రద్దీ క్రమేణా పెరిగి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పింది. ఎటువైపూ కూడా కదల్లేని పరిస్థితి. దీంతో కొంతమంది భక్తులు సబ్‌స్టేషన్‌లోకి ప్రవేశించడంతో విద్యుత్ పరికరాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ షాక్‌కు గురి కాకుండా ఉండేందుకు విద్యుత్ సరఫరా నిలిపేశాం’’ అని చెప్పారు. తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారని, మృతదేహాలు సబ్‌స్టేషన్ ఎంట్రెన్స్ వద్ద పడిఉన్నాయని బింద్ చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకున్న కల్పవాసి పోలీసులు అంబులెన్సులను పిలిపించి గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని కల్పవాసి పోలీస్ స్టేషన్ సీఐ రుద్ర కుమార్ సింగ్ చెప్పారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.

జనవరి 29 సాయంత్రం 7 గంటలకు జరిగిన మీడియా సమావేశంలో మహా కుంభ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయ్ కిరణ్ ఆనంద్, మహా కుంభ్ మేళా డీఐజీ వైభవ్ కృష్ణ రెండో తొక్కిసలాట గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

Read More
Next Story