
బీహార్ ఎన్నికలు: ‘మహా’ కూటమిలో కొలిక్కిరాని సీట్ షేరింగ్..
2020 ఫార్ములా ప్రకారమే అంటున్న కాంగ్రెస్..గెలుపు, ఓటములను దృష్టిలో ఉంచుకుని సీట్లు అడగాలంటున్న ఆర్డేజీ - కూటమిని వీడే యోచనలో VIP పార్టీ ?
బీహార్(Bihar)లో తొలిదఫా ఎన్నికల(Assembly Polls) నామినేషన్ల దాఖలుకు కేవలం నాలుగు రోజులే మిగిలి ఉంది. అయితే ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. కూటమి సీనియర్ నాయకుల మధ్య సోమవారం (అక్టోబర్ 13) జరిగిన సీట్ షేరింగ్ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మరోవైపు మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై కూడా ప్రతిష్ఠంభన నెలకొంది. ఇదే విషయంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆర్జేడీ(RJD) నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలవకుండానే తిరిగి పాట్నాకు చేరుకున్నారు.
సహానీ నిష్క్రమణ?
మహా కూటమిలో భాగస్వామి అయిన వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేష్ సహానీ 30 సీట్లు డిమాండ్ చేశారు. 18 ఇస్తామనడంతో సహానీ అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కూటమి నుంచి నిష్క్రమించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
గతంలో లాగే: కాంగ్రెస్
"2020 ఫార్ములా" ప్రకారం కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పట్టుబడుతోంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్, పార్టీ బీహార్ ఇన్‌చార్జి కృష్ణ అల్లవారు, రాష్ట్ర యూనిట్ చీఫ్ రాజేష్ రామ్ చేసిన ప్రతిపాదనను తేజస్వి, ఆర్జేడీ నాయకులు సంజయ్ యాదవ్, మనోజ్ ఝా తిరస్కరించారు. 2020లో 70 సీట్లలో కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగారని గుర్తుచేస్తూ.. 58 నుంచి 60 సీట్ల కంటే మించి ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్పినట్లు సమాచారం.
‘ఇప్పుడు పరిస్థితి వేరు..’
అయితే బీహార్‌లో ప్రస్తుత ఎన్నికల పరిస్థితిని "2020 ఎన్నికలతో పోల్చలేము" అని కాంగ్రెస్ వాదిస్తోంది. రాహుల్ గాంధీ ‘‘ఓటరు అధికార్ యాత్ర’’ చేపట్టిన తర్వాత పార్టీ గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయన్నది కాంగ్రెస్ నాయకుల మాట.
సహాని నిష్క్రమిస్తే..
ఒకవేళ కూటమి నుంచి సహానీ వైదొలిగితే .. VIP కి కేటాయించిన సీట్లను పంచాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు విశ్వసిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ వాదనతో ఆర్జేడీ ఏకీభవించడం లేదు. వివిధ సామాజిక వర్గాలపై ప్రభావం చూపే నాయకుల మద్దతు కూడగట్టుకునేందుకు వారికి ఆ సీట్లు కేటాయించాలనుకుంటోంది. ఆ లెక్కన భూమిహార్లు, కుష్వాహా సామాజిక వర్గ ఓటర్లు బీహార్ జనాభాలో దాదాపు తొమ్మిది శాతం మంది ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఏలో ఓటింగ్ కూటమితో జతకట్టిన ఆ రెండు సామాజికవర్గాల నేతలకు టిక్కెట్లు ఇచ్చి తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది ఆర్‌జేడీ.
అలాగే EBC తంతి-తత్వా కూటమిపై ప్రభావం చూపే ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ (IIP) చీఫ్ ఐపీ గుప్తాతో కూడా RJD ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పశుపతి పరాస్‌ను కూటమిలోకి తీసుకునేందుకు చర్చలు కూడా జరుగుతున్నాయి. IIP, JMM, RLJP లకు ఒక్కొక్కరికి 2 నుంచి 3 సీట్లను తేజస్వి ఆఫర్ చేశారు.
ఇప్పటికే ఎన్డీఏలో ఖరారయిన పొత్తులు..
ఇటు ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు ఆదివారం కొలిక్కి వచ్చింది. బీజేపీ 101 స్థానాల్లో నితీష్ కుమార్ జేడీ(యూ) 101 సీట్లలో పోటీచేసేందుకు అంగీకరించారు. చిరాగ్ పాస్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ-(రామ్‌విలాస్)కు 29 సీట్లు దక్కాయి. ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చాకు చెరో ఆరు సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే మాంఝీ, కుష్వాహా ఇద్దరూ తమకు తక్కువ సీట్లు కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయంపై సీఎం నితీష్ కుమార్ మౌనంగా ఉన్నారు. సీట్ల పంపకంపై NDAలో ఏర్పడిన విభేదాలు మహా కూటమికి అనుకూలంగా మారుతాయని RJD నాయకులు అంటున్నారు. ఈ రోజు సాయంత్రానికి కూటమిలో సీట్ల సర్దుబాటు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని RJD నేతల మాట.