నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయడం చట్ట విరుద్ధం: సుప్రీం
x

నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయడం చట్ట విరుద్ధం: సుప్రీం

‘కుటుంబసభ్యుల్లో ఒక్కరే నిందితుడు కావచ్చు. ఇంట్లో ఒకరు తప్పు చేశారని, మిగతా కుటుంబ సభ్యులకు ఆశ్రయం లేకుండా చేస్తారా?’ - సుప్రీం కోర్టు సూటి ప్రశ్న.


భారత అత్యున్నత న్యాయస్థానం ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని మందలించింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అధికారులే జడ్జిల్లా వ్యవహరించి.. స్థిరాస్తులను కూల్చడం తగదని హెచ్చరించింది.

యూపీ సర్కారు తమ ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయిస్తోందని వివిధ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు ఇటీవల సుప్రీంకోర్టులో కేసు వేశారు. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు విచారణ చేపట్టింది. ఇకపై పాలకులు, అధికారులు నిందితుల ఇళ్లను కూల్చేస్తే తీవ్రంగా పరిగణించాల్సి వస్తోందని హెచ్చరించింది. తమ ఆదేశాలను ధిక్కారిస్తే కూల్చివేతకు పరిహారాన్ని తమ జీతం నుంచి వసూలు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. కూల్చివేతకు ముందు ఇంటి యజమానికి ముందస్తు నోటీసు తప్పనిసరి చేస్తూ.. కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది సుప్రీం కోర్టు.

కుటుంబసభ్యులకు ఆశ్రయం లేకుండా చేస్తే ఎలా?

‘‘ఒక కార్యనిర్వాహక అధికారి జడ్జిగా వ్యవహరించి నిందితుల ఆస్తులను కూల్చాలన్న నిర్ణయానికి ఎలా వస్తారు? కుటుంబసభ్యుల్లో ఒక్కరే నిందితుడు కావచ్చు. ఇంట్లో ఒకరు తప్పు చేశాడని, మిగతా కుటుంబ సభ్యలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? ఇకపై అలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. అక్రమకట్టడాలయినా సరే.. ఇంటి యజమానికి ముందుగా నోటీసు ఇవ్వాలి. మూడు నెలల్లో మున్సిపల్ అధికారులు ఒక డిజిటల్‌ పోర్టల్‌ను సిద్ధం చేయాలి. ఇప్పటివరకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు, అక్రమ నిర్మాణాలపై తుది ఉత్తర్వులకు సంబంధించిన వివరాలు అందులో పొందుపరచాలి’’ అని జస్టిస్ బీఆర్‌ గవాయ్‌, జస్టిస కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Read More
Next Story