జై శ్రీరామ్ అంటే.. జై శివాజీ, జై భవాని అని అనండి..
x

'జై శ్రీరామ్' అంటే.. 'జై శివాజీ, జై భవాని' అని అనండి..

శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విరుచుకుపడ్డారు. సీఎం ఫడ్నవీస్ విమర్శలు పక్కనపెట్టి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.


శివసేన Shiv Sena (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) భారతీయ జనతా పార్టీ(BJP)పై విమర్శలు గుప్పించారు. ముంబై తూర్పు ములుంద్‌లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ మధ్యకాలంలో బీజేపీ వైఖరిలో చాలా మార్పులొచ్చాయని చెప్పుకొచ్చారు. "ఇంతకు ముందు పాకిస్తాన్‌తో క్రీడా పోటీలను బీజేపీ వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తోనూ భారత జట్టు మ్యాచ్‌లు ఆడుతోంది," అని పేర్కొన్నారు.

విమర్శలొద్దు.. ముందు నిధులు కేటాయించండి..

"నేను ఉద్ధవ్ ఠాక్రేను కాదు, ప్రాజెక్టులను ఆపే వ్యక్తిని కాదు," అని మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఇటీవల శాసనసభలో అన్నారు. సీఎం వ్యాఖ్యలకు ఉద్ధవ్ ప్రతిస్పందించారు. తనపై విమర్శలు కట్టి పెట్టి ముందుగా రైతులకు రుణ మాఫీ చేయాలని, లడ్కీ బహిన్ పథకాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

‘‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులు నిలిపివేశానని, మెట్రో-3 కార్ షెడ్‌ను కాన్జుర్ మార్గ్‌కు తరలించేందుకు ప్రయత్నించానని ఫడ్నవీస్ ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు దాన్ని అదానీ గ్రూప్‌కు కేటాయించారు’’ అని ఉద్ధవ్ గుర్తు చేశారు.

మెట్రో-3 కార్ షెడ్‌ స్థలంపై బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి మధ్య విభేదాలున్నాయి. 2022లో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చి మెట్రో కార్ షెడ్‌ను ఆరేలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఉద్ధవ్ ఠాక్రే దాన్ని కాన్జుర్ మార్గ్‌కు మార్చాలనుకున్నారు.

మహారాష్ట్రలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సిద్ధం కావాలని ఠాక్రే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహాయుతి కూటమి నుంచి వినిపించే 'జై శ్రీరామ్' నినాదానికి ప్రత్యామ్నాయంగా 'జై శివాజీ', 'జై భవాని' అనాలని తన అనుచరులకు సూచించారు.

Read More
Next Story