‘ఆ ఇల్లు సైఫ్‌దని నాకు తెలియదు’
‘‘నేను దొంగతనం చేయడం కోసమే ఇంట్లోకి ప్రవేశించాను. అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని నాకు తెలియదు, ’’ఇంటరాగేషన్‌లో నిందితుడు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. థానే జిల్లాలోని ఘడ్‌బందర్ రోడ్‌లోని హిరనందని ఎస్టేట్‌లో పట్టుబడ్డ నిందితుడు.. థానేలోని రిక్కీస్ బార్‌లో హౌస్ కీపింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ‘‘నిందితుడు బంగ్లాదేశీయుడు. అసలు పేరు ఫఫివుల్ ఇస్లాం షహెజాద్ మహమ్మద్ రహిల్లా అమీన్ ఫకీర్. బంగ్లాదేశ్‌లోని ఝలొకటి ప్రాంతం నుంచి ముంబైకి వచ్చాడు. గత ఆరు మాసాల నుంచి ముంబైలో ఉంటున్నాడు, ’’ అని పోలీసులు చెప్పారు. అరెస్టుకు ముందు తన పేరు విజయ్ దాస్ అని చెప్పాడని, తన ఐడెంటీటీ బయటపడకుండా ఉండేందుకు నిందితుడు తన పేరును తరుచూ మార్చుకునేవాడని తెలిపారు.
ఇంటరాగేషన్‌లో.. తాను ప్రవేశించింది బాలీవుడ్ నటుడి ఇంట్లోకి అన్న విషయం తనకు తెలియదని పోలీసులకు చెప్పాడట నిందితుడు. దొంగతనం కోసమే ఇంట్లోకి చొరబడ్డాడని, అదే సమయంలో సైఫ్‌పై దాడి చేశానని చెప్పాడు.
లే అవుట్ గురించి నిందితుడికి సమాచారం ఉందా?
సైఫ్ ఉంటున్న అపార్టమెంట్‌కు నాలుగంచెల భద్రత ఉంది. కాని లోపలికి ఎలా ప్రవేశించాడన్నది పోలీసులను ఆలోచనలో పడేసింది. నిందితుడు 6 ఫ్లోర్ నుంచి 11వ ఫ్లోర్‌కి చేరుకోవడంపై ఆరా తీస్తున్నారు. సైఫ్ ఉంటున్న అపార్టుమెంట్ లే అవుట్ గురించి నిందితుడికి ఎవరైనా సమాచారం ఇచ్చారా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కేవలం దొంగతనం చేయడానికి వచ్చిన వాడే అయితే సైఫ్‌తో పాటు ఇంట్లో ఉంటున్న మరో వ్యక్తిపై అంత దారుణంగా దాడి ఎందుకు చేశాడన్న కోణంలోనూ విచారిస్తున్నారు.
ఇటు సైఫ్‌పై దాడి ఘటనతో.. ముంబైలోని చాలా అపార్టుమెంటు వాసులు భయాందోళన చెందుతున్నారు. భారీ సెక్కూరిటీ ఉన్న హై ప్రొఫైల్ సెలబ్రిటీ అపార్ట్‌మెంట్‌కే భద్రత లేకుంటే.. ఇక మా పరిస్థితి ఏమిటని మిగతా అపార్టుమెంట్లలో ఉంటున్న సాధారణ జనం ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం సెక్యూరిటీ మరింత పెంచుతూ ప్రొటొకాల్ మారుస్తామని చెబుతున్నారు.