
ఆపిల్ కొత్త COOగా సబిహ్ ఖాన్..
1966లో యూపీలోని మొరాదాబాద్‌లో జన్మించిన సబిహ్ ఖాన్..రెన్‌సీలేర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.
భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్ (Sabih Khan) ఆపిల్(Apple) కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమితులయ్యారు. ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఆపరేషన్స్)గా ఉన్న సబీహ్ ఖాన్ ..ఈ నెలాఖరులో జెఫ్ విలియమ్స్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
జెఫ్ విలియమ్స్ రాజీనామా..
62 ఏళ్ల వయసు ఉన్న జెఫ్ విలియమ్స్.. ప్రస్తుతం COOగా ఉన్నారు. ఈ నెలాఖరులో ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా అనంతరం ఆపిల్ వాచ్, డిజైన్ టీంల పర్యవేక్షణ బాధ్యతలను విలియమ్స్ చూసుకుంటారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
సబీహ్ ఖాన్ ఎవరు?
1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించిన సబిహ్ ఖాన్..ఐదో తరగతి వరకు ఇండియాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబం సింగపూర్‌కు షిప్ట్ కావడంతో అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసి, అమెరికాకు మకాం మార్చాడు. టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రం, మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన సబిహ్ ఖాన్.. రెన్‌సీలేర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1995లో ఆపిల్ ప్రొక్యూర్‌మెంట్ గ్రూప్‌లో చేరడానికి ముందు.. GE ప్లాస్టిక్స్‌లో అప్లికేషన్స్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా, కీ అకౌంట్ టెక్నికల్ లీడర్‌గా పనిచేశాడు.
ఖాన్‌ను ప్రశంసించిన ఆపిల్ సీఈవో..
పర్యావరణ స్థిరత్వానికి కృషి చేసిన సబిహ్ ఖాన్‌పై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రశంసలు కురిపించారు. ఆపిల్ కార్బన్ 60 శాతానికి పైగా తగ్గించడంలో సబిహ్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. యునైటెడ్ స్టేట్స్‌లో ఆపిల్ ప్రాడక్ట్స్ విస్తరించడానికి ఎంతో శ్రమించారు.
"సబీహ్ తెలివైన వ్యూహకర్త. ఆపిల్ సప్లై చైన్‌లో కీలక వ్యక్తి కూడా. కొత్త సాంకేతికతకు మార్గదర్శకత్వం వహించాడు," అని కుక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘‘ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌లో ప్రతిభావంతుడయిన 27 ఏళ్లుగా సబిహ్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. నేను నిష్క్రమిస్తున్నా.. ఆపిల్ నాయకత్వ బాధ్యత సరైన వ్యక్తి చేతుల్లో ఉండబోతుందని నమ్ముతున్నా,’’ అని జెఫ్ విలియమ్స్ అన్నారు.