
Delhi CM Rekha Gupta
ఢిల్లీ సీఎంకు అండగా ఆర్ఎస్ఎస్ ‘టోలీ’
అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి రేఖా గుప్తా..
రేఖా గుప్తా. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధిష్టానం నిర్ణయంతో ఢిల్లీ సీఎం అయ్యారు. ఆమె మంత్రివర్గంలో రాజకీయ అనుభవజ్ఞులు కూడా లేరు. మరి అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎదుర్కోడానికి, పాలనా వ్యవహరాలు చక్కదిద్ది పెట్టడానికి బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ (Rashtriya Swayamsevak Sangh) ఆమెకు అండగా నిలుస్తున్నాయి. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఐదుగురు నేతలతో కూడిన అనధికారిక బృందం ఏర్పాటైంది.
కమిటీ సూచనలతో..
“రేఖా గుప్తా(Rekha Gupta) మంత్రివర్గంలో చాలామందికి పాలనాపర అనుభవం తక్కువ. ఇది కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. ఆ కారణంగానే ఐదుగురు సభ్యుల కమిటీ పార్టీ వ్యవహారాలు, పాలనాపర అంశాల్లో ఆమెకు మార్గనిర్దేశం చేస్తారు,” అని బీజేపీ సీనియర్ నేత ఒకరు ఫెడరల్‌కు తెలిపారు.
ఈ కమిటీ సభ్యులు రేఖా గుప్తాకు "కళ్లు, చెవులు" మాదిరిగా పనిచేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారు. అలాగే పాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) సీఎం గుప్తాకు సహాయం అందించనున్నారు.
సంజయ్ నేతృత్వంలో..
కమిటీకి బీజేపీ కీలక నేత బిఎల్ సంజయ్ నేతృత్వం వహిస్తున్నారు. ఢిల్లీ ఆర్ఎస్ఎస్ నేత దయానంద్, ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి పవన్ రాణా కూడా కమిటీలో సభ్యులు. వీరు ముగ్గురూ ఆర్ఎస్ఎస్ ప్రచారకులు (పూర్తి స్థాయి సభ్యులు). మరో ఇద్దరు సభ్యులు.. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచదేవా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా.
సంఘ్ పరివార్ ‘టోలీ’..
పాలనపరంగా ఇబ్బందులు ఎదురయ్యే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కమిటీలు ఏర్పాటు చేయడం ఆర్ఎస్ఎస్ కొత్తేమీ కాదు. రేఖా గుప్తాకు మళ్లే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మలకు కూడా బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలు సూచనలు ఇస్తున్నారు. గుప్తా, యాదవ్, శర్మ - ఈ ముగ్గురూ తొలిసారి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
మోదీకి కూడా..
“ఈ విధమైన కమిటీల ఏర్పాటు సంఘ్ పరివార్‌లో దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. అవసరం మేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవి సాయపడతాయి. ఇలా పనిచేసే కమిటీలను సంఘ్ పరివార్‌లో ‘టోలీ’ (Toli) అని పిలుస్తారు. ‘‘ప్రధాని మోదీ(PM Modi)కి పాలనాపర, జాతీయ విషయాలలో సాయపడే బృందాలు కూడా ఉన్నాయి,” అని నాగపూర్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ పరిశోధకుడు, రచయిత దిలీప్ దియోధర్ తెలిపారు.
స్పష్టమైన లక్ష్యాలతో..
రేఖా గుప్తా తొలి బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. మహిళా సమృద్ధి యోజన కోసం రూ.5,100 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన మహిళలకు నెలకు రూ.2,500 అందించనున్నారు.
షాతో భేటీ.
ఢిల్లీ పోలీస్ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఆ కారణంగానే మహిళలపై నేరాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలపై మాట్లాడేందుకు రేఖా గుప్తా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీ ప్రభుత్వం మూడేళ్లలో యమునా నది శుద్ధీకరణ, కాలుష్య నియంత్రణను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ సాయం తప్పనిసరి. “ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించినా.. మేము కేంద్ర నుంచి అదనపు నిధులు ఆశిస్తున్నాం,” అని బీజేపీ అధికార ప్రతినిధి అతుల్ గుప్తా చెప్పారు.