Road Accidents | ప్రజలకు చట్టం పట్ల గౌరవం, భయం లేదు: గడ్కరీ
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడని చెప్పారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నా.. వాహనదారులకు చట్టం పట్ల గౌరవం, భయం లేకపోవడం వల్లే మరణాలు జరుగుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ స్పందిస్తూ.. తాను రోడ్డు ప్రమాద బాధితుడినని చెప్పుకొచ్చారు. రోడ్డు, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, చట్టాల అమలు, ప్రమాదాలపై అవగాహన - ఈ నాలుగు రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు.
చట్టం పట్ల గౌరవం లేదు.. భయమూ లేదు..
"సమాజంలోని కొంతమందికి చట్టం పట్ల గౌరవం లేదు. భయమూ లేదు. రెడ్ సిగ్నల్ పడినా తమ వాహనాలను ఆపరు. హెల్మెట్ ధరించరు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఏటా 30వేల మంది చనిపోతున్నారు. నేను కూడా రోడ్డు ప్రమాద బాధితుడిని. మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జరిగిన ప్రమాదంలో నా కాలు నాలుగు చోట్ల విరిగింది. అప్పటి నుంచి నేను అప్రమత్తంగా ఉంటున్నా. ఈ విషయం చెప్పడానికి నేను మాత్రం సంకోచించను. రోడ్డు ప్రమాదాలను సాధ్యమయినంత వరకు తగ్గించాలని చూస్తున్నాం. అయినప్పటికీ ఈ సంవత్సరం 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే జరిగినవే ఎక్కువ. రోడ్డు ప్రమాదాల నివారణకు మీడియా సహకారం తీసుకున్నాం. జరిమానాలు కూడా పెంచాం. కానీ ప్రజలు మాత్రం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. కొన్ని రూట్లలో తరుచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు (బ్లాక్‌స్పాట్) ఉన్నాయి. బ్లాక్‌స్పాట్‌లలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం 40 వేల కోట్లు ఖర్చు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది.’’ అని చెప్పారు గడ్కరీ.