
I.N.D.I.A కూటమి పీఎం అభ్యర్థి ఎవరో చెప్పేసిన ఆర్జేడీ తేజస్వి యాదవ్..
గత పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాని అభ్యర్థి పేరు బయటపెట్టకుండానే ప్రచారం చేసిన భారత కూటమి.
'ఓటర్ అధికార్ యాత్ర'లో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాని అభ్యర్థి రాహులేనని’’ మంగళవారం (ఆగస్టు 19న ) నవాడా పట్టణంలో అన్నారు.
బీహార్(Bihar) రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా సవరణ(SIR)కు వ్యతిరేకంగా లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీహార్ రాష్ట్రంలో ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ను ఆగస్టు 16న మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 16 రోజుల పాటు సుమారు 23 జిల్లాల మీదుగా 1,300 కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్రకు ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A)లో భాగస్వామ్య పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (RJD) మద్దతిస్తోంది. సెప్టెంబర్ 1న పాట్నాలో మెగా ర్యాలీతో రాహుల్ యాత్ర ముగుస్తుంది.
గతంలో ఖర్గే..
ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) గత మూడు సార్వత్రిక ఎన్నికలలో (2914, 2019, 2024) విజయం సాధించింది. రెండుసార్లు సొంతంగా మెజారిటీ సాధించింది. మూడోసారి ఇతర పార్టీల మద్దతుతో మోదీ ప్రధాని అయ్యారు. 2024 ఎన్నికల్లో భారత కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది బయటపెట్టకుండానే ఎన్నికల ప్రచారానికి వెళ్లింది.
కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Kharge)ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ సమర్థించారు.
ఈసీ, బీజేపీపై రాహుల్ విమర్శలు..
'ఓటర్ అధికార్ యాత్ర'లో ఉన్న రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘం, బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇద్దరూ కుమ్మకై ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లు వారికి తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీహార్‌లోని ఇండియా బ్లాక్ తీవ్రంగా శ్రమిస్తోంది.