Delhi Liquor case : AAP నేత మనీష్ సిసోడియాకు బెయిల్ షరతుల సడలింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో సంబంధం ఉన్న అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియా17 నెలల పాటు జైలులో ఉన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ షరతులను సడలించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడివున్న అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆయనకు ఇప్పటికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సిసోడియా దాఖలు చేసిన పిటీషన్‌ను బుధవారం కోర్టు విచారించింది. ఇకపై వారానికి రెండుసార్లు దర్యాప్తు అధికారికి రిపోర్టు చేయాలన్న నిబంధనను జస్టిస్‌లు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సడలించింది. అయితే క్రమం తప్పకుండా కోర్టు విచారణకు హాజరు కావాలని ధర్మాసనం పేర్కొంది.
17 మాసాల పాటు జైలులో..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో సంబంధం ఉన్న అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియా17 నెలల పాటు జైలులో ఉన్నారు. ఆగస్టు 9న సుప్రీం కోర్టు సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య విచారణ అధికారికి రిపోర్టు చేయాలని సుప్రీం కోర్టు షరతు విధించింది. నవంబర్ 22న విచారణ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు 60 సార్లు దర్యాప్తు అధికారుల ముందు హాజరయ్యారని ఆయన తరపు న్యాయవాది సింఘ్వీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌తో సంబంధం ఉన్న అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంను సీబీఐ, ఈడీ రెండూ అరెస్టు చేశాయి. ఫిబ్రవరి 26, 2023న తొలుత సీబీఐ అరెస్టు చేసింది. మరుసటి నెల ED మార్చి 9, 2023న అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28, 2023న ఢిల్లీ మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. ఆగస్ట్ 9న కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది, అందులో రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలు, పాస్‌పోర్ట్ సమర్పణ, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశాలు ఉన్నాయి.