UDISE Report | 2023-24లో తగ్గిన స్కూల్ అడ్మిషన్లు ..
x

UDISE Report | 2023-24లో తగ్గిన స్కూల్ అడ్మిషన్లు ..

జాతీయ విద్యా విధానం (NEP) 2030 నాటికి డ్రాప్‌ అవుట్లను తగ్గించి అందరికీ విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


2023-24 విద్యా సంవత్సరానికి దేశంలో స్కూళ్లలో చేరి విద్యార్థుల సంఖ్య 37 లక్షలకు తగ్గిందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ లెటెస్ట్ ‘యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్’ (UDISE) వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2022-23లో మొత్తం 25.17 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరగా.. 2023-24లో ఈ సంఖ్య 24.80 కోట్లకు తగ్గింది. బాలికల సంఖ్య 16 లక్షలు తగ్గగా, బాలుర సంఖ్య 21 లక్షలు తగ్గింది.

వసతులలేమే కారణమా?

పాఠశాలల్లో మౌలిక వసతులను పరిశీలిస్తే..దాదాపు 90 శాతం స్కూళ్లకు విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్లు, బాలబాలికలకు విడివిడిగా టాయిలెట్స్, దివ్యాంగ విద్యార్థులకు ర్యాంప్‌లు ఉన్నాయి. అయితే 57% స్కూళ్లలో మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. 53% పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉంది.

UDISE Plus అంటే..

విద్యా మంత్రిత్వ శాఖ డేటా కలెక్షన్ ప్లాట్‌ఫాం UDISE Plus దేశవ్యాప్తంగా స్కూళ్ల డేటాను సేకరిస్తుంది. ఆధార్ కార్డు ఆధారంగా విద్యార్థుల వివరాలను ఇందులో అప్‌లోడ్ చేస్తారు. ఆ లెక్కన 2023-24 నాటికి 19.7 కోట్ల మంది విద్యార్థులు తమ ఆధార్ వివరాలను అందజేశారు.

మైనార్టీలెంతమంది?

మొత్తం చేరికల్లో సుమారు 20% వరకు అల్పసంఖ్యాక విద్యార్థులున్నారు. వీరిలో 79.6% ముస్లింలు, 10% క్రైస్తవులు, 6.9% సిక్కులు, 2.2% బౌద్ధులు, 1.3% జైనులు, 0.1% పార్సీలు ఉన్నారు.

ఇక వర్గాల వారీగా విద్యార్థుల సంఖ్యకు పరిశీలిస్తే.. 26.9% సాధారణ వర్గానికి చెందిన వారు, 18% షెడ్యూల్ కులాలకు చెందిన వారు, 9.9% షెడ్యూల్ తెగలకు చెందిన వారు, 45.2% ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఉన్నారు.

కొత్తవిధానంతో రియల్ డేటా..

2023-24లో సేకరించిన డేటా గత సంవత్సరాలతో నేరుగా పోల్చలేమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు పాఠశాల స్థాయిలో కాకుండా వ్యక్తిగత విద్యార్థి డేటాను సేకరిస్తున్నారు. ఈ కొత్త విధానం విద్యా వ్యవస్థకు సంబంధించి స్పష్టమైన, ఖచ్చితమైన డేటాను ఇస్తుందని పేర్కొన్నారు.

ఆందోళన కలిగిస్తున్న డ్రాప్ అవుట్లు..

జాతీయ స్థాయిలో The Gross Enrolment Ratio (GER)లో చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రాథమిక స్థాయిలో GER 96.5% ఉండగా.. ఫౌండేషనల్ స్థాయిలో ఇది 41.5% మాత్రమే ఉంది. మధ్యస్థాయిలో 89.5%, ద్వితీయ స్థాయిలో 66.5% GER ఉంది. మధ్యస్థాయిలో డ్రాప్ అవుట్ రేటు 5.2% ఉండగా, ద్వితీయ స్థాయిలో ఇది 10.9%కి పెరిగింది.

లక్ష్యం దిశగా NEP ..

2020లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (NEP) 2030 నాటికి డ్రాప్‌ అవుట్లను తగ్గించి అందరికీ విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డేటా ఆధారంగా డ్రాప్‌ అవుట్లను గుర్తించి వారిని తిరిగి స్కూళ్లలో చేరుస్తోంది.

రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు..

వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో పాఠశాలల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఇక తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లో పాఠశాలలు తక్కువగా ఉన్నా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2030 నాటికి అన్ని రాష్ట్రాల్లో సమాన విద్య అవకాశాలు కల్పించేందుకు వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

Read More
Next Story