Mamata Banerjee | అవకాశం ఇస్తే I.N.D.I.A కూటమిని లీడ్ చేస్తా..
బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాటయిన I.N.D.I.A కూటమి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందని, అవకాశం ఇస్తే తాను సారథ్యం వహిస్తానంటున్నారు మమత బెనర్జీ.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష ఇండియా కూటమి పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే కూటమికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన రాష్ట్రానికి సీఎంగా ఉంటూనే కూటమిని కూడా సమర్థవంతంగా నడపగలనని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.
మీరు ఎందుకు బాధ్యతలు చేపట్టకూడదని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు .."అవకాశం ఇస్తే కూటమిని నేను ఇక్కడి నుంచే లీడ్ చేస్తా." అని చెప్పారు.
అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం..
బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పాటైన ఇండియా కూటమిలో రెండు డజన్లకు పైగా ప్రతిపక్షాలు ఉన్నాయి. అయితే వారి మధ్య అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలున్నాయి. కూటమి బలంగా లేదని భావించిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. కాంగ్రెస్, కూటమి మిత్రపక్షాలు తమ అహంకారాన్ని పక్కనబెట్టి మమతా బెనర్జీని కూటమి నాయకురాలిగా గుర్తించాలని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కొద్ది రోజుల క్రితం పేర్కొన్నారు.
కొనసాగుతోన్న ఓటమి పరంపర..
మహారాష్ట్రలో BJP అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మహాయుతి కూటమిలోని కాషాయ పార్టీ ఏకంగా 132 స్థానాలు దక్కించుకుని ముఖ్యమంత్రి పదవి దక్కించుకుంది. ఇక జార్ఖండ్‌లో మాత్రం ఇండియా కూటమి బలంగానే పనిచేసింది. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం 34 దక్కించుకుని హేమంత్ సోరేన్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ (ఎంఎల్) 2 గెలుపొందింది. ఒంటరిగా పోరాడిన బీజేపీ కేవలం 21 స్థానాలకు పరిమితమైంది.
ఉపఎన్నికలో గెలుపు..
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అత్యాచార, హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం రేపింది. సీఎం మమత ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని భావించారు. అయితే ఇటీవలి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించి ఆధిపత్యాన్ని చాటుకుంది. CPI(M) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్, దాని మిత్రపక్షమైన CPI(ML) లిబరేషన్, కాంగ్రెస్, ఇండియా కూటమిలో మిత్రపక్షాలు పరాజయాలను చవిచూశాయి. ఆ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు.