కాపిటల్ బీట్ | బీజేపీ చీఫ్‌గా వసుంధర రాజే?
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై గుసగుసలు వినిపిస్తున్న సమయంలో.. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే పేరు మళ్లీ తెరమీదకు వచ్చింది.
నీలు వ్యాస్ నిర్వహించిన ‘క్యాపిటర్ బీట్’(Capital Beat) తాజా ఎపిసోడ్‌లో జాతీయ మీడియా నిపుణుడు అనిల్ శర్మ, సీనియర్ జర్నలిస్ట్-రచయిత తబీన అంజుమ్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ(Bhajanlal Sharma), వసుంధర రాజే(Vasundhara Raje) మధ్య జరిగిన 35 నిమిషాల భేటీని విశ్లేషించారు.
రాజేతో సీఎం భజన్‌లాల్ భేటీ..
వీరిద్దరి సమావేశంపై అనిల్ శర్మ వ్యాఖ్యానిస్తూ.. రాజే నివాసానికి ముఖ్యమంత్రి వెళ్లడం చాలా విషయాలను సూచిస్తుందన్నారు. ఈ సమావేశానికి ముందు రాజే ప్రధాని మోదీతో చర్చలు జరపడం.. ఆమె ప్రాధాన్యతను కేంద్ర నాయకత్వం గుర్తించిందని చెప్పడానికి సంకేతమని పేర్కొన్నారు. ఇది కేవలం సాధారణ చర్చ కాదన్నది స్పష్టంగా కనిపిస్తోందన్న శర్మ.. రాజస్థాన్ BJPలో రాజే దూరదృష్టి కలిగిన నాయకురాలిగా అభివర్ణించారు.
ముందున్న రాజకీయ సవాళ్ల నేపథ్యంలో రాజేకు అధిష్ఠానం వద్ద పెరుగుతున్న ప్రాధాన్యతను తబీన అంజుమ్ హైలైట్ చేశారు. “ఆమెను కొంతకాలం పార్టీ దూరంగా ఉంచినా.. లోక్‌సభ ఎన్నికలు, తన నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగారు,” అని చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో BJP ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపలేదు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా..పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు కేవలం 14 స్థానాలను కైవసం చేసుకుంది.
ముఖ్యమంత్రి లేదా జాతీయ స్థాయి పాత్ర?
వసుంధర రాజే రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె గవర్నర్ పదవిని తిరస్కరించిందని వచ్చిన వార్తలు నేపథ్యంలో.. BJP జాతీయ అధ్యక్షురాలి పాత్రపై కూడా చర్చ జరిగింది. “ఈ పాత్రకు రాజే నో చెప్పరు,” అని శర్మ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ రాజకీయ చాకచక్యంతో రాజే తిరిగి రాజస్థాన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తక్కువేనని శర్మ చెప్పాడు.
రాజే పాత్ర కీలకం..
రాజస్థాన్‌లో రాజే ప్రజాదరణను BJP గమనించినట్టు తెలుస్తోంది. శర్మ ఇటీవల రాజే జోధ్‌పూర్ పర్యటనను ప్రస్తావించారు. అక్కడ రాజేకు ముఖ్యమంత్రితో సమానమైన ఆదరణ లభించింది. “రాజస్థాన్ రాజకీయాల్లో ఆలస్యంగా అయినా రాజే ప్రాధాన్యతను గుర్తించారని,” అని శర్మ పేర్కొన్నారు.
BJP "వన్ నేషన్, వన్ ఎలక్షన్" విధానంలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో రాజే ప్రభావం కీలకమని శర్మ, అంజుమ్ ఇద్దరూ అంగీకరించారు. “రాజే కేవలం తన నియోజకవర్గాన్ని గెలిచే నాయకురాలు కాదు. ఆమెకు BJP లోపల, వెలుపల ఉన్న భారీ మద్దతు ఉంది,” అని అంజుమ్ చెప్పారు.
ఎన్నికల ఫలితాలు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 200 స్థానాలకు 115 నియోజకవర్గాలను కైవసం చేసుకోవడంతో భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రి అయ్యారు.
ఝల్‌రపటన్ నుంచి పోటీచేసిన వసుంధర రాజే విజయం సాధించారు.
2024 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం 25 స్థానాలకు 14 నియోజకవర్గలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఝలావర్ - బారన్ నుంచి పోటీచేసిన వసుంధర రాజే తనయుడు దుష్యంత్ సింగ్ విజయం సాధించారు.