NEET ప్రశ్నాపత్రం లీకేజీపై కాంగ్రెస్ రియాక్షనేంటి?
NEET క్వశ్చన్ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకా ఆయన ఏం చేయబోతున్నారు? రేపు ఏం జరగబోతుంది?
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్నీ (ఎన్‌టీఏ) కొంతమంది విద్యార్థులకు వెయిటేజీ మార్కులు కలపడం, అనుకున్న తేదీ కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేయడం.. విద్యార్థుల్లో గందరగోళానికి దారితీసింది. కొంతమంది క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా చేపట్టిన విచారణలో పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని పోలీసులు నిర్ధారించారు. బీహార్ రాష్ట్రంలో ఈ ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని గుర్తించిన పోలీసులు ఇప్పటికే పలువురు విద్యార్థులు, వ్యక్తులను అరెస్టు చేశారు.
ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బీజేపీపై దుమ్మెత్తిపోస్తుంది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం (జూన్ 20) నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో వేలాది మంది నిరుద్యోగ యువకులు నాన్‌స్టాప్ పేపర్ లీక్‌ల గురించి ఫిర్యాదు చేశారని చెప్పారు.
మోదీ ఎందుకు అరికట్టలేకపోతున్నారు?
‘ఒక్క ఫోన్ కాల్‌తో యుద్ధాలను ఆపేశారని మోదీ గురించి కొందరు గొప్పగా చెబుతున్నారు. కాని పేపర్ లీక్‌లను ఎందుకు ఆపలేకపోతున్నారు’ అని రాహుల్ ప్రశ్నించారు. ప్రభుత్వం సంస్థలను బిజెపి స్వాధీనం చేసుకునే వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని విమర్శించారు.
రేపు దేశవ్యాప్తంగా నిరసనలు..
నీట్ పేపర్ లీకేజీ వ్యవహరంపై శుక్రవారం దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వివిధ రాష్ట్రాల్లోని పార్టీ శాఖలను సూచించారు. ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, సీనియర్ నాయకులు పాల్గొంటారని చెప్పారు.