
సమ్మెలో అటు కార్మిక సంఘాలు.. ఇటు కాంగ్రెస్, ఆర్జేడీ..
S.I.Rకు వ్యతిరేకంగా బీహార్‌లో వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తంచేస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు..
బీహార్(Bihar)లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (S.I.R) చేయాలన్న ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో విపక్షాలు బుధవారం సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ (EC) తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ ప్రక్రియను నిలిపివేయాలని విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. పాట్నాలో జరిగిన ర్యాలీలో మహాఘట్‌బందన్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు ఆర్జేడీ(RJD) నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav ), సీపీఐ నేత దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ నేత డీ రాజా కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఇన్‌కం ట్యాక్స్ గోలాంబర్ నుంచి ఈసీ ఆఫీసు వరకు ర్యాలీ తీశారు. బంద్ నేపథ్యంలో రైలు, రోడ్డు ట్రాఫిక్ స్తంభించింది.
ఇటు నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది కార్మికులు బుధవారం దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. పోస్టల్, బ్యాంకింగ్, విద్యుత్, ఆర్టీసీ రంగ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో సేవలు స్తంభించాయి.
బెంగాల్, కేరళ, బీహార్‌లో ఆందోళనలు..
బుధవారం ఉదయం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ప్రారంభమైందని, పశ్చిమ బెంగాల్, కేరళ, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి ఆందోళనకు సంబంధించిన వార్తలు, ఫొటోలు తనకు అందాయని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అమర్‌జీత్ కౌర్ పీటీఐకి తెలిపారు. సమ్మె వల్ల బ్యాంకింగ్, పోస్టల్, విద్యుత్ సేవా రంగాలు ప్రభావితమవుతాయని ఆమె అన్నారు.
నిరసనకు దిగిన రైతులు..
పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో రైతు సంఘాలు కూడా తమ ప్రాంతాల్లో నిరసనలు చేపడతాయని ఆమె తెలిపారు. కనీస వేతనంగా రూ.26,000 ఉండాలని, పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని, ఈపీఎఫ్‌వో చందాదారులకు నెలనెలా రూ.9,000 కనీస పింఛన్ చెల్లించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.