
రాహుల్ నోట మళ్ళీ ‘ఓట్ చోరీ’ ఆరోపణలు..EC కౌంటర్ ఏమిటి?
భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వారిని కాపాడటం మానుకోవాలని CEC జ్ఞానేష్ కుమార్‌ను కోరిన రాహుల్..
బీజేపీ(BJP), ఎలక్షన్ కమిషన్(EC) కుమ్మకై కాంగ్రెస్(Congress) మద్దతుదారుల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చాలా కాలంగా అంటున్న మాట. తాజాగా విలేఖరుల సమావేశంలో మళ్లీ అవే ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ "ఓటు దొంగలను" కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న దాదాపు 6వేల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారన్నది ఆయన ఆరోపణ. అయితే భారత ఎన్నికల కమిషన్ (ECI) రాహుల్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టి పడేసింది.
రాహుల్ వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు..
‘‘భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోన్న ఓటు వ్యాపారులను CEC రక్షిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జాబితా నుంచి 6,018 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. వారంతా కాంగ్రెస్ మద్దతుదారులే. దానికి నా వద్ద ఆధారాలున్నాయి’’
‘‘ఒక వర్గం పనిగట్టుకుని కాంగ్రెస్ మద్దతుదారుల పేర్లను మాత్రమే జాబితా నుంచి తొలగించారు. కొత్తగా 6,018 దరఖాస్తులు వచ్చాయి. అవన్నీ రాష్ట్రం వెలుపలి నుంచి దరఖాస్తు చేసినవే’’
‘‘ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కంప్యూటర్ ఐపీ అడ్రస్‌లను ఇవ్వండి. ప్రతి రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ కోసం ఓటీపీ అవసరం. 6,018 దరఖాస్తుల ఓటీపీ ట్రైల్స్ కూడా ఇవ్వండి’’
‘‘ఓట్ల దొంగతనం వ్యవహారంపై CID దర్యాప్తు మందకొడిగా జరుగుతుంది. కర్ణాటక CID 18 నెలల్లో 18 సార్లు ECని సంప్రదించింది. IP, డెస్టినేషన్ పోర్ట్‌లు, OTP ట్రైల్స్ వివరాలు ఇవ్వాలని కోరింది. ఈసీ ఇవ్వడం లేదు. ఎందుకు చెప్పాలి’’
''మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గంలో 6,815 మంది పేర్లను ఓటరు జాబితాలోకి కొత్తగా ఎక్కించారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా యూపీలో ఇదే పద్ధతి అమలు చేశారు. వాటికి నా దగర్త ప్రూఫ్స్ ఉన్నాయి.’’
EC కౌంటర్..
అయితే రాహుల్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ ఖండించింది. ఆయన నిధారణ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఏ వ్యక్తి ఓటు హక్కును తొలగించడం వీలుకాదని పునరుద్ఘాటించింది. ఓటరుకు సమాచారం ఇచ్చాకే, ఆయన వాదన విన్న తర్వాతే జాబితా నుంచి పేరు తొలగిస్తామని EC సమాధానమిచ్చింది.
2023లో కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంతమంది ఓటర్ల పేరును తొలగించడానికి విఫలయత్నం జరిగిన తర్వాత కేసు పైల్ చేసి విచారణ చేపట్టామని EC గుర్తుచేసింది.
‘‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీర్ పాటిల్ అలంద్ నియోజకవర్గంలో గెలిచారు. దానికి ముందు 2018 ఎన్నికల్లో బీజేపీకి చెందిన సుభాద్ గుత్తేదార్ విజయం సాధించారు. 2023 ఎలక్షన్ల కంటే ముందు ఓటర్లను తొలగించే ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిపై ఆ ప్రభావం ఉండాలి. కాని అలాంటిదేమి జరగలేదన్నది’’ అన్నది ఈసీ వాదన.