
అస్సాం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రియాంక
త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీల ఎంపిక ..
అస్సాం(Assam) అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్(Congress) అధిష్టానం ప్రియాంకగాంధీ(Priyanka Gandhi)కి అప్పగించారు. ఆమెను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించినట్లు పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
2026 జూన్‌లోపు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి (సంస్థ) KC వేణుగోపాల్ శనివారం (జనవరి 3) రాత్రి ప్రకటించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరికు నలుగురు సభ్యుల కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటన తెలిపింది.
ప్రియాంక జట్టులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటేరియన్ ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలక ఇద్దరు లోక్‌సభ ఎంపీలతో పాటు సిరివెళ్ల ప్రసాద్‌ను అస్సాం కమిటీ సభ్యులుగా నియమించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుత బలాబలాలు..
126 మంది సభ్యులున్న అస్సాం అసెంబ్లీకి ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అస్సాం అసెంబ్లీలో అధికార బీజేపీ బలం 64 కాగా, దాని మిత్రపక్షాలైన ఏజీపీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, యూపీపీఎల్‌కు ఏడుగురు, బీపీఎఫ్‌కు ముగ్గురు సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష శిబిరంలో కాంగ్రెస్ బలం 26, AIUDF కి 15 మంది సభ్యులు, CPI(M) కి ఒక MLA ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నారు.

