ప్రియాంక పార్లమెంటు ప్రవేశం కాంగ్రెస్‌కు కీలక మలుపు?
పార్లమెంటులోకి ప్రియాంక ప్రవేశం రాహుల్ గాంధీకి కలిసొస్తుందా? అనే అంశంపై పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంకగాంధీ వాద్రా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ప్రమాణ స్వీకారం రోజున ఆమె సాంప్రదాయ కేరళ చీర కట్టులో రాజ్యాంగం కాపీ చేత పట్టుకుని పార్లమెంట్ హాల్‌లోకి ప్రవేశించడం పలువురిని ఆకట్టుకుంది. ఇప్పటికే రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభలో ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పడు ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్‌లోని అడుగుపెట్టడంతో కాంగ్రెస్ వర్గాల్లో జోష్ కనిపిస్తోంది. కుటుంబం మొత్తం ఒకేసారి పార్లమెంట్‌లో ఉన్నందున బీజేపీ వ్యూహాలను ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి.
పార్లమెంటులోకి ప్రియాంక ప్రవేశం రాహుల్ గాంధీకి కలిసొస్తుందా? అనే అంశంపై పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీలు వ్యాస్ హోస్ట్‌గా వ్యవహరించే ‘‘ది ఫెడరల్ క్యాపిటల్ బీట్’’ కార్యక్రమంలో ఓపీనియన్స్ షేరు చేసుకున్నారు. ప్రియాంకను ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు తీసుకురావాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహమని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్న మాట. ప్రముఖ పాత్రికేయుడు జావేద్ అన్సారీ ప్రకారం.. ప్రియాంకలోని కలివిడితనం ప్రజలతో త్వరగా కనెక్ట్ అయ్యేందుకు దోహదపడిందని, ఆమె బహుభాషా సామర్ధ్యం, అనర్గళంగా మాట్లాడడం పార్లమెంటులో ఎదురయ్యే సవాళ్లను చక్కగా ఎదుర్కోగలదని అభిప్రాయపడ్డారు. ఇక పొలిటికల్ సైన్స్ నిపుణుడు ప్రొఫెసర్ శశి శేఖర్ సింగ్, ప్రియాంక, ఆమె సోదరుడు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జోడి కాంగ్రెస్ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. మరో వ్యాఖ్యాత ఆనంద్ సహాయ్ ప్రియాంకకు వారసత్వంగా వచ్చిన చరిష్మాను హైలైట్ చేసారు. లోక్‌సభలో రాహుల్, ప్రియాంక ఉండటంతో మోదీ ప్రభుత్వంపై దృఢమైన వ్యతిరేకత వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.