![మణిపూర్‌లో బీజేపీ విభేదాలను నివారించలేని రాష్ట్రపతి పాలన.. మణిపూర్‌లో బీజేపీ విభేదాలను నివారించలేని రాష్ట్రపతి పాలన..](https://andhrapradesh.thefederal.com/h-upload/2025/02/15/513034-optimizerpti.webp)
మణిపూర్‌లో బీజేపీ విభేదాలను నివారించలేని రాష్ట్రపతి పాలన..
‘‘బిరెన్ సింగ్‌కు బదులుగా బీజేపీ శాసనసభాపక్షం నుంచి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. పార్టీ నాయకత్వమే సమగ్రతకు తగ్గ నాయకుడిని ఎంపిక చేయాలి,’’ - తిరుగుబాటు ఎమ్మెల్యే
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన(President's Rule) కొనసాగుతున్నా.. రాష్ట్ర బీజేపీ(BJP)లోని అంతర్గత విభేదాలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. పైగా ఇది తిరుగుబాటు ఎమ్మెల్యే(Rebel MLA)లకు మరింత అసంతృప్తిని మిగిల్చింది. రాష్ట్రపతి పాలన త్వరగా ముగిసే అవకాశం లేదన్న సంకేతాలున్నాయి.
"తొలుత సమాజాన్ని నిరాయుధంగా మార్చండి" – ఇది భద్రతా బలగాలకు కేంద్రం ఇచ్చిన ఆదేశం. ఈ ప్రక్రియకు దాదాపు 3 నెలలు పట్టే అవకాశం ఉంది. అయితే
తిరుగుబాటుదారుల ఎమ్మెల్యేలు ఇంతకాలం వేచి చూడటానికి సిద్ధంగా లేరు. రాష్ట్రపతి పాలన ఇలాగే కొనసాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుందని వారు భావిస్తున్నారు.
సమాజాన్ని ఆయుధ రహితంగా చేసే ఆపరేషన్‌లో ఏదైనా పౌర హింస చోటుచేసుకుంటే , బీజేపీనే నిందితురాలిగా నిలుస్తుందనే వారి భావన. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బీజేపీ అంతర్గత విభేదాలే రాష్ట్రపతి పాలనకు కారణమని ప్రచారం జరుగుతోంది.
"కేంద్రంతో పాటు మేము కూడా జనం దృష్టిలో దోషులుగా ముద్ర పడతాం. సోషల్ మీడియాలో ఇప్పటికే బీజేపీ అంతర్గత అసంతృప్తి కారణంగానే రాష్ట్రపతి పాలన వచ్చిందని ప్రచారం జరుగుతోంది," అని ఒక రెబెల్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
బిరెన్ సింగ్(Biren Singh)కు బదులుగా కొత్త నేత..
తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఫిబ్రవరి 14న మరోసారి బీజేపీ ఉత్తరాది మేనేజర్ సంపిత్ పాత్ర ద్వారా తమ డిమాండ్‌ను హైకమాండ్‌కి చేరవేశారు. బిరెన్ సింగ్‌కు బదులుగా బీజేపీ శాసనసభాపక్షం నుంచి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. "మేము ఎవరిని ముఖ్యమంత్రిగా చేయాలనే పేరును సూచించలేదు. పార్టీ నాయకత్వమే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, సమగ్రతకు తగ్గ నాయకుడిని ఎంపిక చేయాలి," అని తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.
ఫిబ్రవరి 20 వరకు..
పార్టీ హైకమాండ్ నుంచి స్పందన రాకుంటే తిరుగుబాటు శిబిరం తమ అధినాయకత్వాన్ని కలుసుకునేందుకు ఒక బృందాన్ని పంపుతామని ప్రకటించింది.
కుకి ఎమ్మెల్యేలను తప్పించి అసెంబ్లీలో మొత్తం 49 మంది సభ్యులున్నారు. ఇటీవల మరణించిన ఎన్పీపీ ఎమ్మెల్యే ఎన్. కయిసీ కారణంగా టడూబీ నియోజకవర్గం ఖాళీగా ఉంది. ప్రస్తుతానికి బిరెన్ సింగ్‌కు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, మిత్రపక్షాల నుంచి ముగ్గురు మద్దతుగా ఉన్నారని సమాచారం. జనతా దళ్ (యునైటెడ్) – 6, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) – 6, నాగా పీపుల్స్ ఫ్రంట్ – 5, స్వతంత్ర ఎమ్మెల్యేలు – 3, కాంగ్రెస్ – 50. తిరుగుబాటు బృందం బిరెన్ సింగ్ వర్గం నుంచి మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను తమవైపు తెచ్చుకోగలమని ధీమాగా ఉంది.
తాజా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం "ఉభయ వర్గాల మధ్య సమగ్రత లేకపోతే.. కొత్త ప్రభుత్వం కూడా అస్థిరంగానే ఉంటుంది" అని భావించి రాష్ట్రపతి పాలన వైపు మొగ్గుచూపింది. రాజకీయ అస్థిరతతో పాటు భద్రతా పరిస్థితి కూడా ఆందోళనకరం. గత 21 నెలల అల్లర్లలో దొంగిలించిన 6 వేల ఆయుధాల్లో ఇప్పటి వరకు 2,200లను మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకున్నాం అని సైనిక వర్గాలు తెలిపాయి. మైతేయి, కుకి మిలిటెంట్ గ్రూపులు కూడా భారీగా ఆయుధాలు కలిగి ఉన్నాయని సమాచారం.
COCOMI అభిప్రాయం
మణిపూర్‌లో పలు పౌరసంఘాలను సమన్వయ పరిచే కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ (COCOMI) రాష్ట్రపతి పాలనను "అసమంజసమైనది, ఉద్దేశపూర్వకంగా మణిపూర్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టే చర్య,"గా అభివర్ణించింది.
"సీఎంను రాత్రివేళ రాజీనామా చేయించటం, అసెంబ్లీ సమావేశానికి ముందు దాన్ని అమలు చేయటం, ప్రజలకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవటం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకం,’’ అని పేర్కొంది.
"ప్రభుత్వ పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే మణిపూర్‌లోని ప్రతి బీజేపీ ఎమ్మెల్యే, నేత ప్రజలకు బాధ్యత వహించాల్సి వస్తుంది" అని వారు హెచ్చరించారు.