మన్మోహన్ సింగ్ మృతికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళి..
x

మన్మోహన్ సింగ్ మృతికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళి..

మాజీ ప్రధాని మృతికి గౌరవసూచకంగా దేశం అంతటా ఏడు రోజుల సంతాప దినాలు పాటించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.


భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఆయన మృతికి సంతాపసూచకంగా దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, రాజకీయాల గడ్డు ప్రపంచంలో ఏకాభిప్రాయ నిర్మాత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం (డిసెంబర్ 26) రాత్రి న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మరణించారు. ఆయన వయసు 92. అంత్యక్రియలు శనివారం (డిసెంబర్ 28) నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మన్మోహన్ సింగ్‌కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మన్మోహన్‌ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని ప్రధాని మోదీ అన్నారు. విశిష్ట పార్లమెంటేరియన్‌ అయిన సింగ్ జీవితం నిజాయితీ, నిరాడంబరతో కూడుకున్నదని అన్నారు.

జనవరి 1వరకు సంతాపదినాలు..

మన్మోహన్ సింగ్ మృతికి గౌరవసూచకంగా డిసెంబర్ 26, 2024 నుంచి జనవరి 1, 2025 వరకు భారతదేశం అంతటా ఏడు రోజుల సంతాప దినాలు పాటించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ఏడు రోజుల పాటు జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు.

దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్‌ సింగ్‌.. అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు.1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానిగా సేవలందించారు. ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు పునాది వేశారు.

Read More
Next Story