VB-G RAM G బిల్లు ఆమోదంపై తమిళనాడులో మాటల యుద్ధం
x

VB-G RAM G బిల్లు ఆమోదంపై తమిళనాడులో మాటల యుద్ధం

పార్లమెంట్‌లో నిరసనల మధ్యే ఆమోదం..


Click the Play button to hear this message in audio format

ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంటులో విక్షిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు- 2025 (VB-G RAM G బిల్లు) ఆమోదం పొందింది. అయితే తమిళనాడు(Tamilnadu)లో మాత్రం ఈ బిల్లుపై సీఎం స్టాలిన్(CM Stalin), అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి(EPS) మధ్య మాటల యుద్ధం మొదలైంది. బిల్లులో కొన్ని మార్పులు చేసినా..మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. EPS కూడా బిల్లును స్వాగతించారు. ఉపాధి రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచడం సంతోషించదగ్గ విషయమన్నారు. అయితే మహాత్మా గాంధీ పేరునే కొనసాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


డీఎంకే(DMK) హామీ ఏమైంది?

2021 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తాను అధికారంలోకి వస్తే MGNREGA పని దినాలను 100 నుంచి 150కి పెంచడంతో పాటు వేతనాలు పెంచుతానని DMK ఇచ్చిన హామీని EPS గుర్తు చేశారు. అధికారం దక్కాక ఆ మాట ఊసేలేదన్నారు.


నిరసనలకు ప్లాన్..

బిల్లుపై కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే సహా ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రకటించాయి. తమిళనాడులో వామపక్షాలు, వీసీకే డిసెంబర్ 23న రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి డిసెంబర్ 24న రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలకు ప్లాన్ చేస్తోంది.

పార్లమెంట్‌లో డీఎంకే ఎంపీ కనిమొళి బిల్లును వ్యతిరేకించారు. "విబి-జి రామ్ జి కింద ప్రతి రాష్ట్రానికి ఎంతమందికి ఉపాధి కల్పించాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తమిళనాడు గ్రామీణ పేదలను ఏ మాత్రం పట్టించుకోదు." అని విమర్శించారు.


బిల్లును స్వాగతించిన తమిళనాడు బీజేపీ..

బీజేపీ తమిళనాడు ముఖ్య అధికార ప్రతినిధి నారాయణ్ తిరుపతి బిల్లు పాస్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమైన సంస్కరణగా ఆయన అభివర్ణించారు. "20 సంవత్సరాల తర్వాత, MGNREGA కి సాంకేతికత, మౌలిక సదుపాయాల అనుసంధానం, మోసాల జరగడకుండా చూడాల్సిన అవసరం ఉంది. మోడీ హయాంలో నిధులు ఐదు రెట్లు పెరిగాయి. 2014లో రూ. 33వేల కోట్ల నుంచి ఇప్పుడు రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెరిగాయి. ఇక పేరు మార్పుపై వస్తున్న ఆగ్రహాన్ని "అసూయ ప్రచారం" తప్ప మరొకటి కాదని తోసిపుచ్చారు.

Read More
Next Story