రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ ‘పాగ’
x

రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ ‘పాగ’

ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలకు ప్రధాని మోదీ విభిన్నమైన తలపాగాలు ధరించి హాజరవుతారు. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా జాగ్రత్త తీసుకొంటారు.


76వ గణతంత్ర వేడుకలు దేశంమంతా ఘనంగా జరిగాయి. ఊరు, వాడ జాతీయ జెండా రెపరెపలాడింది. దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే మోదీ (PM Modi) ధరించిన తలపాగా (turban) అందరి దృష్టిని ఆకర్షించింది. ఎరుపు, పసుపు మిళిత వర్ణంతో ప్రత్యేకంగా ఉంది. ఏటా స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలకు ప్రధాని మోదీ విభిన్నమైన తలపాగాలు ధరించి హాజరవుతారు. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా జాగ్రత్త తీసుకొంటారు. 2024 గణతంత్ర వేడుకల్లో కుంకుమ, గులాబీ, తెలుపు, పసుపు రంగులతో కూడిన తలపాగా మోదీ ధరించారు. ఇది గుజరాత్‌ సంస్కృతికి అద్దంపట్టింది. ఇక 2023లో మహారాష్ట్రకు చెందిన ‘ఫెటా’.. 2022లో రిపబ్లిక్‌డే వేడుకల్లో సంప్రదాయ కుర్తా, పజామా, గ్రే చెక్ ఎంబ్రాయిడెడ్ జాకెట్‌తో పాటు ఉత్తరాఖండ్‌కు చెందిన టోపీని ధరించారు. 2021లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సంస్కృతిని ప్రతిబింబించే ‘హలారీ పగ్డీ’ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇది సాంస్కృతిక వారసత్వ ప్రాముఖ్యాన్ని మాత్రమే కాకుండా.. ప్రాంతీయ హస్తకళల నైపుణ్యాన్ని కూడా తెలియజేస్తుంది. 2020లో గణతంత్ర వేడుకల్లో కుంకుమ రంగులోని ‘బంధేజ్‌’ తలపాగాను ధరించారు. ఇది రాజస్థాన్‌, గుజరాత్‌ ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించింది.

ఇక 2019లో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మోదీ బహురంగుల పాగతో కనిపించారు. 2018లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేశర రంగు పాగతో, 2017లో ప్రధానమంత్రి ఎరుపు, పసుపు రంగులతో కూడిన పాగతో, 2015లో క్రిస్‌క్రాస్ గీతలున్న పసుపు పాగతో, 2016లో గులాబీ పసుపు రంగులలో టై-డై పాగతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2014లో ప్రధానమంత్రిగా తన తొలి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ ఎరుపు జోధ్పురి "బ్యాంధేజ్" పాగను ధరించారు.

Read More
Next Story