PM Modi | మన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది
x

PM Modi | మన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది

రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ల అయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ ప్రసంగించారు.


భారతదేశం పెద్ద ప్రజాస్వామిక దేశం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యానికే తల్లి అని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ల అయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు ఐక్యత అతిపెద్ద అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధికార ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం, మనుస్మృతి మధ్య వైరుధ్యాన్ని వివరించారు. మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని సావర్కర్‌ విశ్వసించారని, కానీ, రాజ్యాంగాన్ని తెరచినప్పుడు అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూల ఆలోచనలు, వారి మాటలు అందులో కనిపిస్తాయన్నారు.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం భారత రాజ్యాంగం - 75 సంవత్సరాల ప్రయాణం గురించిన చర్చకు తీర్మానాన్ని ప్రారంభించారు. ఆయన తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి వక్తలు మాట్లాడారు. విపక్షాలపై రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. రాజ్యాంగానికి తాము ఎంతో విలువనిస్తామని, అయితే దాన్ని జేబుల్లో పెట్టుకుని తిరగడం కొంతమందికి నేర్పించారని కాంగ్రెస్‌నుద్దేశించి విమర్శించారు.

పార్లమెంటులో ప్రియాంక తొలి ప్రసంగం..

విపక్ష పార్టీల నుంచి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మొదటగా మాట్లాడారు. గత నెలలో వయనాడ్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పార్లమెంటులో ఆమె తొలిసారిగా మాట్లాడారు. హిందీలో 32 నిమిషాల ఆమె ప్రసంగం సంయమనంగా సాగింది. అనేక అంశాలపై మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు, అదానీ గ్రూప్ గుత్తాధిపత్యం, మహిళలపై అఘాయిత్యాలు, మణిపూర్, సంభాల్‌లలో హింసాత్మక సంఘటలు, దేశవ్యాప్త కుల గణన కోసం డిమాండ్‌పై ఆమె చర్చించారు. ఈ ఏడాది లోక్‌సభ ఫలితాలు రాకపోతే అధికార పార్టీ రాజ్యాంగాన్ని మార్చడం ప్రారంభించి ఉండేదని అభిప్రాయపడ్డారు.

‘రాజ్యాంగం రక్షణ కవచం’

రాజ్యాంగాన్ని న్యాయం, ఐక్యత, భావ ప్రకటనా స్వేచ్ఛకు రక్షణ కవచంగా అభివర్ణించారు ప్రియాంక. గత 10 సంవత్సరాలలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దానిని విచ్ఛిన్నం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. గతం గురించి, జవహర్‌లాల్ నెహ్రూ గురించి మాత్రమే బీజేపీ మాట్లాడుతోందని..ఇప్పుడు వారు ఏమి చేస్తున్నారో దేశానికి చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ఆర్థిక న్యాయానికి పునాది వేసిందని, రైతులకు, పేదలకు భూ పంపిణీ చేసిందని ఆమె నొక్కి చెప్పారు.

కుల గణనకు అఖిలేష్ డిమాండ్..

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుల గణనను మళ్లీ నిర్వహించాలని కోరారు. సంభాల్‌లో హింసాత్మక ఘటనలు, ప్రార్థనా స్థలాలపై ఇతర సర్వేలను ప్రస్తావిస్తూ..మసీదుల కింద దేవాలయాల కోసం చూస్తున్న వారు శాంతిని కోరుకోవడం లేదని బీజేపీ నుద్దేశించి అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తన ప్రసంగంలో "న్యాయ అధికారి" మరణాన్ని ప్రస్తావించారు. దీనిపై ఎక్కువ మంది ట్రెజరీ బెంచ్‌ సభ్యులు స్పందించారు. పార్లమెంటరీ మంత్రి రిజిజు ఆమెపై చర్య తీసుకోవాలని కోరారు.

Read More
Next Story