
'శౌర్య యాత్ర'కు ప్రధాని మోదీ నాయకత్వం..
శంఖ్ సర్కిల్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ సర్కిల్ వరకు కొనసాగిన యాత్రను వీక్షించేందుకు భారీగా వచ్చిన ప్రజలు, భక్తులు ..
ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం గుజరాత్ రాష్ట్రం సోమనాథ్(Somnath)లోని మహాదేవుడి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు 'శౌర్య యాత్ర'(Shaurya Yatra)కు నాయకత్వం వహించారు. ఘజని మహమూద్ దండయాత్ర సమయంలో సోమనాథ్ ఆలయాన్ని కాపాడేందుకు ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించేందుకు ఈ 'శౌర్య యాత్ర' నిర్వహించారు. శంఖ్ సర్కిల్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ సర్కిల్ వరకు ఈ యాత్రను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనంపై మోదీ జనసమూహానికి చేయి ఊపుతూ ముందుకు కదిలారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ఏర్పాటు చేసిన వేదికలపై తమ సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.
1299లో సోమనాథ్ ఆలయాన్ని రక్షించడంలో తన ప్రాణాలను త్యాగం చేసిన హమీర్జీ గోహిల్ విగ్రహానికి మోడీ పుష్పాంజలి ఘటించారు. తరువాత ఆలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మోడీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పటేల్ జోక్యం కారణంగా స్వాతంత్ర్యం తర్వాత సోమనాథ్ ఆలయం పునరుద్ధరించబడింది.

