వివక్షను మహారాష్ట్ర ప్రజలు ఉపేక్షించరు: బడ్జెట్‌పై MVA భాగస్వాములు
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి (MVA) భాగస్వాములు కేంద్రంపై విరుచుకుపడ్డారు. బడ్జెట్ కేటాయింపులో తమ రాష్ట్రాన్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి (MVA) భాగస్వాములు కేంద్రంపై విరుచుకుపడ్డారు. బడ్జెట్ కేటాయింపులో మహారాష్ట్రను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో మహారాష్ట్ర గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. అత్యధికంగా పన్ను చెల్లిస్తున్నా.. తమ రాష్ట్రం పట్ల పక్షపాతపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.
I can understand the bjp wanting to save its government and giving Bihar and Andhra Pradesh a huge sum of the budget.
— Aaditya Thackeray (@AUThackeray) July 23, 2024
But what is Maharashtra’s fault?
That we are the largest taxpayer?
What did we get against what we contribute?
Was Maharashtra even mentioned once in the…
తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ ప్రయత్నం: ఎంవీఏ
ఆదిత్య థాకరే ఎక్స్ వేదికగా బడ్జెట్ కేటాయింపును తప్పుబట్టారు. “తమ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి బీహార్, ఆంధ్రప్రదేశ్‌లకు బడ్జెట్‌లో భారీ మొత్తాన్ని కేటాయించారని నేను అర్థం చేసుకోగలను. మహారాష్ట్ర చేసిన తప్పేమిటి? మేము అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నాం. అందుకు ప్రతిఫలంగా ఏమీ లభించకపోవడం సిగ్గుచేటు. బడ్జెట్‌లో ఒక్కసారైనా మహారాష్ట్ర ప్రస్తావన వచ్చిందా? బీజేపీ మహారాష్ట్రను ఎందుకు ద్వేషిస్తుంది? రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోంది.’’ అని థాకరే పేర్కొన్నారు.
‘వివక్షను ప్రజలు ఉపేక్షించరు’
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి ఏమీ ప్రకటించలేదని మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత కాంగ్రెస్‌కు చెందిన విజయ్ వాడెట్టివార్ పేర్కొన్నారు. బీజేపీ కీలక మిత్రపక్షాలు జేడీయూ, టీడీపీ పాలిస్తున్న రెండు రాష్ట్రాలైన బీహార్, ఆంధ్రప్రదేశ్‌లకు మాత్రమే బడ్జెట్‌లో ఊతం లభించిందన్నారు. "దేశంలో అత్యధిక పన్ను (ఆదాయం) చెల్లిస్తున్న రాష్ట్రాన్ని ఇలా ఎందుకు పరిగణిస్తారు? మహారాష్ట్ర పట్ల "సవతి తల్లి" ప్రేమ చూపడం సరికాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రను ఎప్పుడూ ‘సెకండరీ’గా పరిగణిస్తోంది. మహారాష్ట్ర నుంచి పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకెళ్లారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని బీజేపీ తుంగలో తొక్కుతోంది. వీటన్నింటిని ఎంతకాలం భరించాలి? మహారాష్ట్ర ప్రజలు ఈ వివక్షను చూస్తూ ఊరుకోరు. తగిన సమాధానం చెబుతారు’’ అని వాడెట్టివార్ అన్నారు.
కేటాయింపులను వివరించిన ఫడ్నవీస్..
కేంద్ర బడ్జెట్‌ను బ్యాలెన్స్‌డ్‌గా పేర్కొన్న ఫడ్నవీస్.. రాష్ట్రానికి అన్ని ప్రధాన రంగాలలో తగిన కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. “జాతీయ అభివృద్ధిలో మహారాష్ట్ర కీలకమైనది. ప్రధానమంత్రి మోదీ ఎజెండాలో ఇది మహారాష్ట్ర ఎప్పుడూ ఉంటుంది. రాష్ట్రానికి అన్ని కీలక రంగాల్లో తగిన కేటాయింపులు జరిగాయి’’ అని బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ అన్నారు. ముంబై మెట్రోకు రూ.1,087 కోట్లు, ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్-3కి రూ.908 కోట్లు, పూణే మెట్రోకు రూ.814 కోట్లు, మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.600 కోట్లు సహా రాష్ట్రానికి కేటాయించిన నిధులను ఆయన బయటపెట్టారు.
పాలక కూటమి భాగస్వాములు శివసేన (షిండే), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి కూడా కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించాయి. రాష్ట్రానికి చేసిన కేటాయింపులకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని వారు స్పష్టం చేశారు.