పాట్నాలో నీట్ విద్యార్థిని అనుమాస్పద మృతిపై వెల్లువెత్తిన నిరసనలు..
x

పాట్నాలో నీట్ విద్యార్థిని అనుమాస్పద మృతిపై వెల్లువెత్తిన నిరసనలు..

చేతులకు గాజులతో బీహార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నిరసన..


Click the Play button to hear this message in audio format

పాట్నా(Patna)లో నీట్(NEET) విద్యార్థినిపై అత్యాచారం, మృతి బీహార్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఈ దారుణం వెలుగులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత కూడా ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) స్పందించకపోవడం ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన (సుశాసన్) గురించి మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. అధికారం చేపట్టిన రెండు నెలల తర్వాత ఈ కేసు ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా.. ఇప్పటికే వారి నిర్లక్ష్యం, ప్రైవేట్ హాస్టల్ యజమాని అనుమానాస్పద పాత్ర, ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


హాస్టల్ గదిలో ఏం జరిగింది?

పాట్నాలోని చిత్రగుప్తా నగర్‌ పరిధిలోని శంభు బాలికల హాస్టల్‌ గదిలో 18 ఏళ్ల నీట్ విద్యార్థిని అపస్మారక స్థితిలో కనిపించారు. జనవరి 6న జరిగిన ఈ ఘటన గురించి జెహానాబాద్‌లో ఉంటున్న బాలిక తల్లిదండ్రులకు హాస్టల్ యజమాని సమాచారం ఇవ్వలేదు. విషయం తెలిసి బాధితురాలి తల్లిదండ్రులు పాట్నా చేరుకునే సమయానికే హాస్టల్ యజమాని బాధితురాలిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. తరువాత పరిస్థితి విషమించడంతో బాధితురాలిని మరొక ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత జనవరి 10న పాట్నాలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఈ మూడు ఆసుపత్రుల్లో 5 రోజులు కోమాలో ఉన్న బాధితురాలు జనవరి 11న కన్నుమూసింది. హాస్టల్‌లో ఉంటూ NEET కోసం రెండున్నరేళ్లుగా శ్రమిస్తున్న విద్యార్థిని చివరకు MBBS చదవాలన్న తన కల నెరవేరకుండానే తనువు చాలించింది.


‘నిందితులను వదలం..’

గత కొన్ని రోజులుగా బీహార్‌లోని పలు ప్రాంతాల్లో అత్యాచార ఘటనలు జరుగుతున్నా అవి పెద్దగా బయటకు రాలేదు. అయితే ఈ కేసు విషయంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రత్యర్థుల ఆందోళనలతో బీహార్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సోమవారం ఒక ప్రకటన చేశారు. పోలీసులకు ఫ్రీ హ్యండ్ ఇచ్చామని, నిందితులను వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు.


పోలీసులు కోణం గురితప్పిందా?

పాట్నా పోలీసులు ఈ కేసును కేవలం ఆత్మహత్య కోణంలోనే చూశారు. లైంగిక వేధింపుల కోణంలో ఎందుకు చూడలేదన్నదే అసలు ప్రశ్న. బాధితురాలు తన హాస్టల్ గదిలో మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని, అత్యాచారానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీసు అధికారులు పేర్కొన్నారు. చిత్రగుప్త నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రోష్ణి కుమారి, పాట్నా ASP అభినవ్ కుమార్, SP పరిచయ్ కుమార్, SSP కార్తీకయ్ శర్మ ఇదే విషయాన్ని చెప్పి తల్లిదండ్రుల అత్యాచారం, హత్య ఆరోపణలను తోసిపుచ్చారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు కోసం వేచి చూడకుండా వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

"మాకు న్యాయం కావాలి. మా కూతురిని హాస్టల్ దగ్గర ఉన్న వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలి" అని బాధితురాలి తల్లి ది ఫెడరల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

లైంగిక దాడి జరిగిన ఆనవాలు ఉన్నాయని జనవరి 14న పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) వైద్యులు పోస్ట్‌మార్టం రిపోర్టులో పేర్కొన్నారు. అయితే సెకండ్ ఒపినియన్ కోసం ఆ రిపోర్టును ఢిల్లీలోని AIIMS పంపారు. అక్కడి నుంచి రిపోర్టు రావాల్సి ఉంది.


S.I.T దర్యాప్తు..

పోలీసుల తీరుపై అసంతృప్తి, ప్రభుత్వ తీరుపై అసహనం పెరిగిపోతుండడంతో బీహార్ డీజీపీ వినయ్ కుమార్ ఈ కేసు దర్యాప్తును SITకు అప్పగించారు. ఏడుగురు సభ్యుల SIT బృదం ఈ కేసును విచారించనున్నట్లు ఆయన తెలిపారు. SIT సభ్యులు బాధితురాలి గ్రామాన్ని ఇప్పటికే రెండుసార్లు సందర్శించారు. ఆమె తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారితో మాట్లాడారు. హాస్టల్, ఆసుపత్రులను తనిఖీ చేశారు. సిబ్బంది వైద్యులను ప్రశ్నించారు.

తొలుత బాధితురాలిని ప్రభాత్ మెమోరియల్ హిరామతి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడి వైద్యులు ఆమెను ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ రిపోర్టును SIT అధికారులు ​​పరిశీలించారు. తలపై అలాగే శరీరంలోపల అంతర్గత గాయాలు ఉన్నాయని, లైంగిక దాడి గురించి పేర్కొనలేదు. ఇటు FSL బృందం సోమవారం (జనవరి 19) శంభు హాస్టల్‌ను సందర్శించి ఆధారాలు సేకరించింది. నమూనాలను సేకరించామని, దర్యాప్తు నివేదిక రెండు మూడు రోజుల్లో వస్తుందని CID ADG పరస్నాథ్ తెలిపారు.


హాస్టల్ యాజమాని అరెస్టు..

ఈ కేసులో హాస్టల్ యాజమాని మనీష్ రంజన్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. త్వరలో రిమాండ్ కోరే అవకాశం ఉంది.

ఒక ప్రైవేట్ సంస్థలో నాల్గో తరగతి ఉద్యోగిగా పనిచేసిన మనీష్ రంజన్.. అతి తక్కువకాలంలోనే ధనవంతుడిగా ఎదగడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంతో కలిసి హాస్టల్‌పై అంతస్తులో ఉండేవాడని, రాత్రిపూట చాలా మంది అతనిని కలిసేందుకు వచ్చేవారని పోలీసుల విచారణలో తేలింది.

ఈ ఘటనపై కాంగ్రెస్ కార్యకర్తలు చేతులకు గాజులు వేసుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వాటిని హోం శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సామ్రాట్ చౌదరికి బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే ఘటనపై సీపీఐ (ఎంఎల్) నాయకులు కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నితీష్ కుమార్ తన సమృద్ధి యాత్రను నిలిపివేసి, బీహార్‌లోని మహిళల గౌరవం, జీవితాలను కాపాడటంపై దృష్టి పెట్టాలని లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య కోరారు. తన నియోజకవర్గానికి చెందిన బాధితురాలికి న్యాయం జరగకపోతే తాను రాజకీయాలను వదులుకుంటానని జెహానాబాద్‌కు చెందిన ఆర్జేడీ ఎంపీ సురేంద్ర యాదవ్ అన్నారు.

ఈ కేసును బీహార్ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. రేపు (జనవరి 21న) జెహానాబాద్‌లోని బాధితురాలి తల్లిదండ్రులను కలిసేందుకు ఒక బృందాన్ని పంపనుంది.

ఇటు కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ సింగ్, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సహా ప్రతిపక్ష నాయకులు బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని కిషోర్ ఆరోపించారు.

ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ డిమాండ్ చేసినట్లుగా..నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తారా? లేదా పరిణామాలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తారా ? అనేది చూడాల్సి ఉంది.

Read More
Next Story