విషాదం: ట్రైన్ హైజాక్ ఘటనలో 21 మంది ప్రయాణికులు, నలుగురు సైనికులు మృతి
x

విషాదం: ట్రైన్ హైజాక్ ఘటనలో 21 మంది ప్రయాణికులు, నలుగురు సైనికులు మృతి

33 మంది మిలిటెంట్లను మట్టుపెట్టిన పాకిస్థాన్ భద్రతా బలగాలు.


పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్ (Pakistan train siege) ఘటన విషాదాన్ని మిగిల్చింది. మిలిటెంట్లు 21 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సైనికులను చంపేశారు. రైలును హైజాక్ (Hijack) చేసింది తామేనని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది. ప్రయాణికులను రక్షించేందుకు రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు 33 మంది మిలిటెంట్లను హతమార్చారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ నిర్ధారించారు. బుధవారం సాయంత్రానికి ఆపరేషన్‌ పూర్తయ్యిందని ప్రయాణికులందరినీ సురక్షితంగా రక్షించామని చెప్పారు.

వేరుచేసి మరీ..

రైల్లోకి మిలిటెంట్లు ప్రవేశించిన వెంటనే ప్రయాణికుల ఐడీ కార్డులను తనిఖీ చేశారని ఓ ప్రయాణికుడు చెప్పారు. ‘‘ప్రయాణికుల నుంచి సైన్యం, భద్రతా దళాల్లో పనిచేసే వారిని వేరు చేశారు. ఆ తర్వాత మా ముందే ఇద్దరు సైనికులను కాల్చేశారు’’ అని తెలిపాడు.

"అమానవీయ చర్య"

ట్రైయిన్ హైజాక్ ఘటనను అమానవీయ ఘటనగా పేర్కొన్నారు పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నక్వి. ఉగ్రవాదుల నుంచి బందీలను రక్షించిన భద్రతా బలగాలను ఆయన ప్రశంసించారు. "ప్రజల మద్దతుతో ఉగ్రవాదులను నిర్మూలించే సమయం దగ్గర్లోనే ఉంది," అని అన్నారు.

‘మా మద్దతు ఉంటుంది’

ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబారి కార్యాలయం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. "పాకిస్తాన్‌ పౌరుల భద్రత, రక్షణకు మద్దతుగా నిలుస్తాం," అని అమెరికా రాయబారి పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ రాయబారి రీనా కియోంకా కూడా దాడిని ఖండించారు.

హైజాకర్ల డిమాండేమిటి?

సుమారు 440 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్‌కు బయలుదేరిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) వేర్పాటువాదులు బోలన్‌ ప్రాంతంలో మంగళవారం హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. 24 గంటల్లో బలోచ్‌ ఉద్యమ నేతలను జైళ్ల నుంచి విడుదల చేయకపోతే ప్రయాణికులను శిక్షిస్తామని వారు హెచ్చరించారు.

Read More
Next Story